Monday, October 7, 2019

తమ సత్వ మెఱిఁగియు దాఁచిరి గాకా

తమ సత్వ మెఱిఁగియు దాఁచిరి గాకా
తము నేలే రాము స్వతంత్రము చూపవలసి IIపల్లవిII

హనుమంతుని తోఁక నసురులందరుఁ గూడి
మును లంకలో నగ్ని ముట్టించే వేళను
అనలము శీతో భవ యన నేరిచిన సీత
పనివి రావణ హతో భవ యన నేరదా IIతమII

అంకెల జలధి దాఁటి యట రాముని ముద్రిక
సంకె లేక చేతఁ బట్టి సాహసమునా
లంకాధిదేవతయైన లంకిణిఁ గొట్టినవాఁడు
వుంకించి రావణుఁ జంప నోపఁడా వాయుజుఁడు IIతమII

శ్రీవేంకటేశుఁడైన శ్రీరాఘవుని పంపున
వావిరి నంగదముఖ్య వానరులెల్లా
ఆవేళ హేమపాత్ర లగ్నిలో వేసినవారు
రావణునందులో వేసి రా నోపరా IIతమII 15-263




తరువాత ఈ బంగారు పాత్రలు అగ్నిలో వేసిన కధ రామాయణం లో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో
నాకు తెలియదు.ఎవరైనా చెప్పి పుణ్యం కట్టుకోరూ---

దీనిలో సీత,హనుమంతుడు,అంగదుడు మొదలైనవారంతా రాముని గొప్పతనం లోకానికి తెలియాలని
ఉద్దేశించి మాత్రమే వారా పనులను చేయకుండా వదిలిపెట్టారట! కాని వాళ్ళంతా ఆ పనులు చేయగల సమర్ధత
గలనారేనట!తాళ్ళపాక కవుల సంకీర్తనలు ఒక్కోటీ ఒక్కో అణిముత్యమే.అవి చదవటానికి,వ్రాయటానికి,పాడుకోవటానికి అత్యంత
ఆనందదాయకాలు.

నన్ను నెంచుకొన నయ్యా నగుఁ బాట్ల నేను

నన్ను నెంచుకొన నయ్యా నగుఁ బాట్ల నేను
కన్నవారి విన్నవారిఁ గాకు సేసేనే IIపల్లవిII

మలసి నా గుణములు మంచివైనప్పుడు గదా
యెలమి నెదిరి నేరము లెంచేది
చెలఁ గి నే పాపములు సేయకుండె మరి గదా
తొలఁ గి పరుల నే దూషించేది IIనన్నుII

నడవడి నే లెస్స నడిచినప్పుడు గదా
పొడవై యన్యులకు నే బుద్ధి చెప్పేది
వెడఁ గై యితరుల నే వేఁ డనియప్పుడు గదా
కడవారి విరక్తి గాదనేది IIనన్నుII

కామినుల సంగమము కాదని నే మరి కదా
నేమమై యితరుల నే నిందించేది
నా మదిలో నన్ను నేను నవ్వుకొని సిగ్గుపడి
నీ మఱఁ గు చొచ్చితి నేఁ డు శ్రీ వేంకటేశIIనన్నుII १५-२०३

ఇది పెదతిరుమలాచార్యుల అధ్యాత్మ సంకీర్తన।
నేను ఎటువంటి వాడనో నన్ను నేను అసహనముతో ఎంచుకొననయ్యా।నన్ను చూసినవారిని విన్నవారిని కాకు(?)చేసేనే।
తిరిగి నా గుణములు మంచివైనపుడు కదా నేను విలాసముతో ఎదుటివారి నేరములెత్తి చూపేది।ఒప్పి నే పాపములు చేయనప్పుడు కదా మరి యితరుల పాపములు గురించి వారిని దూషించగలిగేది।నా నడవడి లెస్సగా నున్నపుడు కదా నేను పెద్దనై యితరులకు బుద్ధి చెప్పగలిగేది।అవివేకినై నేను యితరుల వేడనపుడు కదా నేను సమీపము నందలివారి విరక్తిని కాదనగలిగేది।నేను కామినీ స్త్రీల తో పొందును కాదనినపుడు కదా నియమంతో నేను యితరుల నిందించేది।నా మనసులో నేను నాగుఱించి నవ్వుకొని శ్రీ వేంకటేశా నీ చాటుకు వచ్చాను।--ఈ కీర్తన అందరికీ మార్గదర్శనము చేసేటటువంటిది।ఎవరికి వారు తనను గూర్చి ఇటువంటి విమర్శ చేసుకోవలసి వుంది.

ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది

ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బిఁకనూ. IIపల్లవిII

మఱవను ఆహారంబును మఱవను సంసారసుఖము
మఱవను ఇంద్రియభోగము మాధవ నీ మాయా
మఱచెద సుజ్ఞానంబును మఱచెద తత్త్వరహస్యము
మఱచెద గురువును దైవము మాధవ నీ మాయా. IIఎక్కడిII

విడువనుఁ బాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుఁడ నీ మాయా
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుఁడ నీ మాయా. IIఎక్కడిII

తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల
తగులను మోక్షపు మార్గము తలఁపున యెంతైనా
అగపడి శ్రీవేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీ వేలితి నాకా యీ మాయా. IIఎక్కడిII ౧౫-౩౮

తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల అధ్యాత్మ సంకీర్తనల లోనిదీ సంకీర్తన.

అందమైన నడక.ఇంకా అందమైన పదాల అమరిక.అందమైన అనుప్రాస. విష్ణువు మీది అపరిమిత నమ్మకం.తను ఎన్ని బంధాలలో చిక్కుకున్నా అవి విష్ణుమాయ వలన తన్నేమీ చేయలేవనే గట్టి నమ్మకం.

వందేహం జగద్వల్లభం దుర్లభం

వందేహం జగద్వల్లభం దుర్లభం
మందరధరం గురుం మాధవం భూధనం. IIపల్లవిII

నరహరిం మురహరం నారాయణం పరం
హరి మచ్యుతం ఘనవిహంగవాహం
పురుషోత్తమం పరం పుండరీకేక్షణం
కరుణాభరణం కలయామి శరణం. IIవందేII

నందనిజనందనం నందకగదాధరం
యిందిరానాథ మరవిందనాభం
యిందురవిలోచనం హితదాసవరదం, ము
కుందం యదుకులం గోపగోవిందం. IIవందేII

రామనామం యజ్ఞరక్షణం లక్షణం
వామనం కామినం వాసుదేవం
శ్రీమదవాసినం శ్రీవేంకటేశ్వరం
శ్యాఁమలం కోమలం శాంతమూర్తిం. IIవందేII
 

అనుచు రావణుసేన లటు భ్రమయుచు వీఁగె

అనుచు రావణుసేన లటు భ్రమయుచు వీఁగె
యినకుల చంద్ర నేఁ డిదిగో నీమహిమ. IIపల్లవిII

దదదద దదదద దశరథ తనయా
కదిసితిఁ గకకక కావవె
అదె వచ్చె బాణాలు హా నాథ హా నాథ
పదపద పదపద పారరో పవుంజులూ. IIఅనుచుII

మమమమ్మ మమమమ్మ మన్నించుఁడు కపులార
సమరాన చచచచ్చ చావకుండా
మెమెమెమ్మె మెమెమెమ్మె మేము నీ వారమె
మొమొమొమ్మొ మొమొమొమ్మొ మొక్కేము మీకు.IIఅనుచుII

తెతెతెత్తె తెతెతెత్తె తెరు వేది లంకకు
తతతత్త తలమని దాఁగుదురూ
గతియైన శ్రీ వేంకటగిరి రఘునాథ
సతమై మమ్మింక నేలు జయ జయ నీకు. IIఅనుచుII

వెట్టి వలపు చల్లకు విష్ణు మూరితి నాతో

వెట్టి వలపు చల్లకు విష్ణు మూరితి నాతో
వెట్టి దేర మాటాడు విష్ణు మూరితి. IIపల్లవిII

వినయము సేసేవు విష్ణు మూరితిఁ నీవు
వెనకటివాఁడవే కా విష్ణు మూరితి
వినవయ్య మా మాఁట విష్ణు మూరితి మమ్ము
వెనుకొని పట్టకుమీ విష్ణు మూరితి. IIవెట్టిII

వెరవు గలవాఁడవు విష్ణు మూరితి నేఁడు
వెరగైతి నిన్నుఁ జూచి విష్ణు మూరితి
విరివాయ నీ మాయలు విష్ణు మూరితి నాకు
విరు లిచ్చేవప్పటిని విష్ణు మూరితి. IIవెట్టిII

వెలసె నీ చేతలెల్లా విష్ణు మూరితి మా
వెలుపల లోన నీవె విష్ణు మూరితి
వెలలేని శ్రీవేంకట విష్ణు మూరితి కూడి
విలసిల్లితివి నాతో విష్ణు మూరితి. IIవెట్టిII

చిత్తజగురుఁడ నీకు శ్రీమంగళం నా

చిత్తజగురుఁడ నీకు శ్రీమంగళం నా
చిత్తములో హరి నీకు శ్రీమంగళం. IIపల్లవిII

బంగారుబొమ్మవంటి పణతి యురము మీద
సింగారించిన నీకు శ్రీమంగళం
రంగుమీఱఁ బీతాంబరము మొలఁ గట్టుకొని
చెంగలించే హరి నీకు శ్రీమంగళం. IIచిత్తజII

వింత నీలములవంటి వెలఁదిని నీపాదముల
చెంతఁ బుట్టించిన నీకు శ్రీమంగళం
కాంతుల కౌస్తుభమణిఁ గట్టుక భక్తులకెల్లఁ
చింతామణి వైన నీకు శ్రీమంగళం. IIచిత్తజII

అరిది పచ్చలవంటి అంగన శిరసు మీఁద
సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం
గరిమ శ్రీవేంకటేశ ఘనసంపదతోడి
సిరివర నీకు నిదె శ్రీమంగళం. IIచిత్తజII

శరణు శరణు నీకు సర్వేశ్వరా నీ

శరణు శరణు నీకు సర్వేశ్వరా నీ
శరణాగతే దిక్కు సామజవరదా. IIపల్లవిII

వేయి శిరసులతోడి విశ్వరూపమా
బాయట నీ పరంజ్యోతి పరబ్రహ్మమా
మ్రోయుచున్న వేదముల మోహనాంగమా
చేయి చేత అనంతపు శ్రీమూరితి. IIశరణుII

ముగురు వేల్పులకు మూలకందమా
వొగి మునుల ఋషుల వోంకారమా
పగటు దేవతలకు ప్రాణబంధుఁడా
జగమెల్లాఁ గన్నులైన సాకారమా. IIశరణుII

వెలయు సచ్చిదానంద వినోదమా
అలరు పంచవింశతి యాత్మతత్వమా
కలిగిన దాసులకు కరుణానిధీ
చెలఁగి వరమిచ్చే శ్రీవేంకటేశుఁడా. IIశరణుII

లేరా దేవతలూ లేరా లావరులూ

లేరా దేవతలూ లేరా లావరులూ
ఆరీతి నాఁ డెందు వోయి రధికులే కలిగితే IIపల్లవిII

మొదల సృష్టికి నెల్ల మూలమైన బ్రహ్మదేవుని
యిదె నాభిఁ బొడమించే నచ్యుతుఁడే
తుదఁ బ్రళయమునందు దొంతులుగా జగములు
వుదరమునందు నించె నొక్కఁడే నిలిచి. IIలేరాII

మోవలేక దేవతలు ములుగఁగ మందరము
తోవ మోచి తెచ్చినట్టి దొరవిష్ణువే
వేవేగ జలధిలోన వేసితే కుంగిన కొండ
ఆవల వీఁపున నెత్తె నాదికూర్మ మితఁడే.IIలేరాII

తనబంటు శేషుని తరితాడు గావించి
కొననాధారమై నిలిచె గోవిందుఁడే
దనుజులు దేవతలు తచ్చి తచ్చి యలసితె
వెనక నంతయుఁ దచ్చె విశ్వరూపుఁడితఁడే.IIలేరాII

కాలకూటమున కీశుఁ గంచముగాఁ జేసి మింగి
చాలి నీలవర్ణుఁ డాయె శశివర్ణుఁడే
కాలకంఠుఁ డాయెను శంకరుఁడు పాత్రయిన వంక
పోలింప ఋగ్వేద మిదె పొగడీ నితనిని.IIలేరాII

అమరఁ దనయిచ్చ నమృతము పంచిపెట్టె
నమరుల కెల్లా నారాయణుఁ డితఁడె
నెమకి తా ననువైన నిర్మల కౌస్తుభము
కమలముపై లక్ష్మిఁ గై కొనె నీ ఘనుఁడె.IIలేరాII

మూలమని నుడిగితే మోచివచ్చి కరిఁగాచె
కోలుముందై యిందరిలో గోవిందుఁడే
తూలిన శృతులు దెచ్చి తుంగిన(?) భూమియెత్తె
అలరి భస్మాసురుని నడఁచె నీ దేవుఁడే.IIలేరాII

యిందు మౌళిపై నేసి యింద్రియములఁ గట్టిన
కందర్పజనకుఁడైన కమలాక్షుఁడే
కందువ పాదతీర్థపు గంగ హరు శిర మెక్కె
యెందును దైవ మితఁడే యిందిరానాథుఁడు.IIలేరాII

మాయలెల్లా నితనివె మహిలో సంకల్పములు
యేయెడ 'శ్రీవిష్ణురాజ్ఞయీతనిదే
తోయరాని చక్రముచే దుర్వాసు వారఁగాను
దాయి దండై బ్రదికించె తనబంటు చేత.IIలేరాII

సంది నన్ని మతముల సన్యాసులకు గతియై
అందరి నోళ్ళకు నారాయణు నామమే
ముందు సంధ్యాజపముల మూలపు టాచమనము
అందుల కితని కేశవాది నామములె.IIలేరాII

వాదుల 'నదైవం కేశవాత్పర'మని తొల్లి
వేదవ్యాసు లనిన విభుఁ డీ హరి
సోదించి వశిష్టుఁడును శుకనారదాదులు
పోదితోడ దాసులైరి పురుషోత్తమునికి.IIలేరాII

బాణాసురుని నఱికి భంగపడఁగా విడిచె
వేణునాద ప్రియుఁడైన విఠ్ఠలుఁడే
బాణమై త్రిపురములు భస్మీకరము చేసె
ప్రాణుల రక్షించే నీ పరమాత్ముఁడే.IIలేరాII

ఆపదలందినవేళ యసురబాధలు మాన్ప
చేపట్టి లోకము గాచే శ్రీపతియే
పై పై నింద్రాదులకు పారిజాతాదిసిరులు
వైపుగాఁ గాయించిన వరదుఁడు నితఁడే.IIలేరాII

భూమి యీతనిసతి యంబుధు లితని పరపు
సోమ సూసౌదు లితని చూపుఁగన్నులు
వేమరు నూర్పులే గాలి విష్ణుపద మాకాశము
వాములైన హరి నీ వాసుదేవుఁడే.IIలేరాII

హరునిఁ బూజించవలె నంటె నర్జునునకు
సిరులఁ బాదము చాఁచె శ్రీకృష్ణుఁడే
అరిది మార్కండేయుఁ డతని మహిమ చూచి
వరదై నా మితఁ డని వాదించి కొలిచె.IIలేరాII

ధృవపట్ట మితఁ డిచ్చె దొరకొని శరణంటే
వివరింప నిదివో శ్రీవేంకటేశుఁడే
యివల నితనిఁ జెప్ప నెవ్వరి వశము లింక
భువిఁ బార్వతి హరినిఁ బొగడేటినాఁడు.IIలేరాII