Monday, October 7, 2019

తతిగొని ఏమరఱక తలఁచఁగవలెఁ గాక

తతిగొని ఏమరఱక తలఁచఁగవలెఁ గాక
హితవై నీ నామ మున్న దిఁక నేల చింతా IIపల్లవిII

దప్పిగొన్నవానికి శీతలోదకమువలె
కప్పి పతివ్రతకు మంగళసూత్రమువలె
ముప్పిరి దరిద్రునకు ముంగిటి ధనమువలె
నెప్పుడు నీ నామ మున్న దిఁక నేల చింతా. IIతతిII

నలిరేఁగి విషధగ్ధునకు నిర్విషమువలె
యిల నెండ దాఁకినదేహికి మంచి నీడవలె
చెలగి జాత్యంధునికి సిద్దాంజనమువలె
నెలమి నీ నామ మున్న దిఁక నేల చింతా। IIతతిII

పట్టభద్రునోరికిఁ గప్రపుఁ బలుకువలె
గుట్టునఁ దండ్రికి ముద్దుఁ గొడుకువలె
గట్టిగా శ్రీవేంకటేశ కడఁగి నా నాలికెకు
యిట్టే నీ నామ మున్న దిఁక నేల చింతా। IIతతిII

No comments:

Post a Comment