Sunday, October 6, 2019

సడిఁ బెట్టెఁ గటకటా సంసారము!చూడ-

సడిఁ బెట్టెఁ గటకటా సంసారము!చూడ-
జలధిలోపలియీఁత సంసారము IIపల్లవిII

జమునోరిలో బ్రదుకు సంసారము!చూడ
చమురుదీసినదివ్వె సంసారము
సమయించుఁబెనుదెవులు సంసారము చూడ
సమరంబులో నునికి సంసారము IIసడిII

సందిగట్టినతాడు సంసారము చూడ
సందికంతలతోవ సంసారము
చందురునిజీవనము సంసారము చూడ
చంద మేవలెనుండు సంసారము IIసడిII

చలువలోపలివేఁడి సంసారము చూడ
జలపూఁతబంగారు సంసారము
యిలలోనఁ దిరువేంకటేశ నీదాసులకు
చలువలకుఁ గడుఁజలువ సంసారముIIసడిII1-199


ఈ సంసారము కటకటా అపకీర్తిని కలుగజేస్తుంది.అంతేకాక ఇది- అంటే ఈ సంసారము-సముద్రములో యీత,యముని నోటిలో ఉండే బతుకు,చమురు తీసివేసిన దీపం,చావు తెచ్చిపెట్టే పెద్దరోగం,యుద్దరంగము మధ్యలో ఉండటం లాంటిది,ఇరుకైన వీధిలో కట్టిన తాడు,ఇరుకైన ఎగుడుదిగుడు త్రోవ,వృద్ధి క్షయములతోనున్న చందమామ జీవనము,చందమేవలె(?)ఉండేది,చల్లదనం లోని వేడి,జలపూఁత(?)బంగారు,ఇంకా ఓ వేంకటేశ! ఈ భూమిపై నీ దాసులకు చలవచేసే అన్నిటికంటేకూడా ఇంకా చలవ చేసేది యీ సంసారము.

No comments:

Post a Comment