Sunday, October 6, 2019

మంచం బెక్కిన పిమ్మట మరి వావియు లేదు

మంచం బెక్కిన పిమ్మట మరి వావియు లేదు
చంచల ముడిగిన పిమ్మట శంకకుఁ బనిలేదు. IIపల్లవిII

పదిలంబుగ సర్వాత్మక భావము దెలిసిన పిమ్మట
ముదమున నెవ్వరిఁ జూచిన మొక్కక పోరాదు
హృదయము పరమేశ్వరునకు నిరవై పోయిన పిమ్మట
యెదిరిని కెలఁకులఁ జూడను ఇతరము పనిలేదు. IIమంచంII

సకలేంద్రియములు హరిపై చయ్యనఁ బెట్టిన పిమ్మట
వొకటియు నోరికిఁ జవియును వొద్దిక పనిలేదు
వికసించిన పరిణామము వెల్లువ ముంచిన పిమ్మట
చికురము ముడువనుఁ గట్టను చీరకుఁ బనిలేదు. IIమంచంII

పరమాత్ముఁడు తిరువేంకటపతి యని తెలిసిన పిమ్మట
పరిపరి చదువుల లంపటములఁ బడఁ బనిలేదు
హరియే చైతన్మాత్మకుఁ డని తెలిసిన పిమ్మట
దురితములకుఁ బుణ్యములకు త్రోవే పనిలేదు. IIమంచంII

No comments:

Post a Comment