Sunday, October 6, 2019

పురుషుండని శృతి వొగడీనట ఆపురుషుఁడు నిరాకారమట

పురుషుండని శృతి వొగడీనట ఆపురుషుఁడు నిరాకారమట
విరసవాక్యము లొండొంటికి నివి వింటే నసంబద్ధములు IIపల్లవిII

మొగమున బ్రాహ్మలు మొలిచిరట ఆమూరితి అవయవ రహితుఁడట
తగుబాహువులను రాజులట ఆతత్వమే యెంచఁగ శూన్యమట
పగటున తొడలను వైశ్యులట ఆబ్రహ్మము దేహము బయలట
అగపడి పాదాల శూద్రులట ఆతని రూపము లేదట. IIపురుషుంII

తనవందనమునుఁ గలదట దైవము తనుఁ జూడఁ గన్నులు లేవట
తనవిన్నపమునుఁ జేయునట ఆతనికిని వీనులు లేవట
తను యిచ్చినదే నైవేద్యంబట దైవము నోరే లేదట
తనయిచ్చేటిధూపంబును గలదట దైవముముక్కును లేదట. IIపురుషుంII

అంతాఁ దానే దైవమట యజ్ఞము లొరులకుఁజేయుటట
సంతతమునుఁ దా స్వతంత్రుఁడటా జపములవరముల చేకొంటట
చింతింపఁ దానే యోగియటా చేరువ మోక్షము లేదట
పంతపు శ్రీవేంకటపతిమాయలు పచారించిన వివియట. IIపురుషుంII




అతడిని వేదము పురుషుడు అని ఒకపక్క పొగడినదట.ఇంకోపక్క ఆ పురుషునికి ఆకారమే లేదట. ఈ రెండూ ఒకదానికొకటి వ్వ్యతిరేకమైన మాటలు,వింటే అసంబద్ధములుగా కనిపిస్తాయి.
ఆపురుషుని ముఖమునుండి బ్రాహ్మణులు పుట్టారట.ఇంకోప్రక్క ఆ మూర్తి అవయవ రహితుడని అంటున్నారు.
ఆతని బాహువులనుండి రాజులు జన్మించారట.ఎంచితే ఆ తత్వమే శూన్యమైనదట.
ప్రకటించగ ఆతని తొడలనుండి వైశ్యులు పుట్టారట.ఆ బ్రహ్మము యొక్క దేహము శూన్యమైనదట.
చూస్తే ఆతని పాదాలనుండి శూద్రులు జన్మించారట.ఇంకోప్రక్క ఆతనికి అసలు రూపమే లేదట.--పురుషుండని శృతి వొగడీనట.

తన దైవమునకు స్తుతిచేయుట ఉన్నదట.ఇంకోప్రక్క తను చూడటానికి కన్నులే లేవట.
తన విన్నపమును వినిపిస్తాడట.ఆతనికి వినడానికసలు చెవులే లేవట.
తను నైవేద్యాన్ని అర్పిస్తాడట.ఆ దైవానికి ఆరగించడానికి నోరే లేదట.
తను ధూపాన్ని ఇస్తాడట కాని ఆఘ్రాణించడానికి దైవానికసలు ముక్కే లేదట.--పురుషుండని శృతి వొగడీనట.

అంతా ఓ ప్రక్క తానే దైవమట.యజ్ఞాలనేమో ఇతరులకొరకు చేస్తాడట.
ఎల్లప్పడూ తాను పూర్తి స్వతంత్రుడట.ఇంకోప్రక్క జపాలు చేసి వరాలు కోరుతుంటాడట.
చితించగా తానే ఒక యోగి.కానీ ఆతని చేరువలో మోక్షమే లేదట.
ఇవన్నీ ఏమిటి?చూడగా చూడగా శ్రీవేంకటేశ్వరుని మాయలు కాక!--పురుషుండని శృతి వొగడీనట.

No comments:

Post a Comment