Monday, October 7, 2019

కంబములో వెడలితివి కరిరాజుఁ గాచితివి

కంబములో వెడలితివి కరిరాజుఁ గాచితివి
పంబి యిన్నిటా నీకు పనియటే శ్రీహరీ. IIపల్లవిII

యెవ్వఁడూ మొఱవెట్టునో యిట్టె రక్షించే ననుచు
యెవ్వఁడూ ననుఁ బేర్కొనునో యింతటాఁ బలికేననుచు
యెవ్వఁడూ మదిఁ దలచునో యిక్కువఁ బొడచూపే ననుచు
వువ్విళ్ళూరఁ గాచుకొని వుందువటే శ్రీహరీ. IIకంబముII

ఆపన్నుఁడు శరణంటే నడ్డము వచ్చే ననుచు
యేపొద్దు ధ్యానించువానికి యెదుట నుండే ననుచు
పై పైఁ బూజించేవానికి పాదములు చాఁచే ననుచు
వోపి యెప్పుడు గాచుకొని వుందు వటే శ్రీహరీ. IIకంబముII

అడిగి బొగడే వానికి నప్పుడే నొసగే ననుచు
చిడిముడి నీ దాసునికి చెప్పినట్టు సేసే ననుచు
బడినే శ్రీవేంకటేశ భక్తి సేసే వానికిని
వుడివోక కాచుకొని వుందువటే శ్రీహరీ. IIకంబముII 

No comments:

Post a Comment