Sunday, October 6, 2019

ఇద్దరు దేహసమ్మంధ మిదివో మాయ

ఇద్దరు దేహసమ్మంధ మిదివో మాయ
గద్దించి యాడవుండునో కడసారీ తాను

తోడఁబుట్టినమమత తొడఁగి కొన్నాళ్ళకు
వాడికె పుత్రులమీఁదవలె నుండదు
వేడుక వారెవ్వరో వీరెవ్వరో కాని
కూడపెట్టీ వీరికే కొట్లాడీ వారికే IIఇద్దII

తల్లి మీఁదఁ గలభక్తి తనకే కొన్నాళ్ళకు
యిల్లాలు మీఁదవలె నింత వుండదు
వెల్లవిరి నది యెంత విచారించ నిది యంత
యిల్లు ముంగి లొక్కరిది యెరవు వొక్కరిది IIఇద్దII

నీతితో శ్రీవేంకటేశుఁ నిత్య సేవ కొన్నాళ్ళ-
కీతల సంసారమంత యితవు గాదు
ఆతఁడెట్టు యివియెట్టు అందరూ నెఱిఁగినదే
చేతు లొకటిమీఁదట చిత్త మొకయందు IIఇద్దII 2-92

మగవానికి ఇద్దరి తో ఉండే దైహికమైన సంబంధాలు కాలక్రమేణ మారుతూ వుంటాయి.చివరాఖరికి అతను ఏవైపు ఉంటాడో తెలియదు.
బాల్యంలో తోబుట్టువుల మీద వుండే ప్రేమ కొన్నాళ్ళకు అంటే కాలం గడిచే కొద్దీ తన పుత్రుల మీద వున్నంతగా వుండదు.వారెవరో వీరెవరో అన్నట్లుంటుంది.ఒకరి కోసం కూడబెడతాడు,ఒకరితో కొట్లాడుతాడు.అదేవిధంగా తల్లి మీద తనకు చిన్నతనంలో ఉండే భక్తి పెద్దయ్యాక తన భార్య మీద వున్నంతగా వుండదు.ఒకరిమీద ప్రకటిత మైనంతగా ఇంకొకరిమీద ప్రకటితం కాదు.విచారించాల్సిన విషయం.ఒకరికి యింటిలో సింహభాగం.ఇంకొకరికి అరువుతెచ్చుకున్న వెనక భాగం.అలాగే శ్రీవేంకటేశునికి అనునిత్యము కొన్నాళ్ళు సేవ చేస్తే తరువాత తరువాత ఆ కైంకర్యము సంసారమంత హితవుగా ఉండదు.ఈ విషయాలు అందరికీ తెలిసినవే.చేతులు దేవుడికి నమస్కరిస్తున్నట్లుగానే వున్నా మనసెక్కడో వుంటుంది.

No comments:

Post a Comment