Sunday, October 6, 2019

ఒక్కడే ఏకాంగవీరుఁ డుర్వికి దైవమౌనా(మైనాడు?)

ఒక్కడే ఏకాంగవీరుఁ డుర్వికి దైవమౌనా(మైనాడు?)
యెక్కడా హనుమంతుని కెదురా లోకము IIపల్లవిII

ముందట నేలేపట్టమునకు బ్రహ్మయినాఁడు
అందరు దైత్యులఁ జంపి హరిపేరైనాఁడు
అంది రుద్రవీర్యముఁ దానై హరుఁడైనాఁడు
యెందు నీ హనుమంతుని కెదురా లోకము. IIఒక్కడేII

చుక్కలుమోవఁ బెరిగి సూర్యుడు దానైనాఁడు
చిక్కుఁబాతాళము దూరి శేషుఁడై నాఁడు
గక్కన వాయుజుఁడై జగత్ర్పాణుఁడై నాఁడు
యెక్కువ హనుమంతుని కెదురా లోకము. IIఒక్కడేII

జలధిఁ బుటమెగసి చంద్రుఁడు దానైనాఁడు
చెలఁగి మేరువు పొంత సింహమైనాఁడు
బలిమి శ్రీవేంకటేశుబంటై మంగాంబుధి-
నిల యీ హనుమంతుని కెదురా లోకము. IIఒక్కడేII ౪-౪


ఒక్కడే వీరుడు,విరక్తుడైన విష్ణుభక్తుడు ఈ ప్రపంచమునకు దైవమవుతాడా! హనుమంతునికీ లోకములో యెక్కడైనా ఎదురా?(యెక్కడా ఎవరూ ఎదురు లేరు).

ముందట తా నేలే రాజ్యమునకు బ్రహ్మ(సృష్టికర్త)అయినాడు. ఆపై రాక్షసుల నందరిని చంపి విష్ణుమూర్తిపేరిటి వాడైనాడు (పాలకుడు).అంతేకాక రుద్రుని వీర్యమే తానై శివుడే యైనాడు(లయకారుడు).యిటువంటి హనుమంతునికీ లోకములో ఎదురు నిలవగల వారెవ్వరు?
నక్షత్రాలను దాటి పెరిగి సూర్యుడే తానైనాడు.మిగిలి పాతాళములోనికి దూరి తాను శేషుడే అయ్యాడు.
గక్కన(?)వాయుపుత్రుడై జగత్తునకు ప్రాణాధారమైనాడు(తండ్రి వలె). యిటువంటి హనుమంతుని కీ లోకములో యెదురు నిలవ గల వారెవ్వరు?
సముద్రము నుండి మీదికెగసి తాను చంద్రుడే ఐనాడు.ఒప్పి తాను మేరుపర్వతము దగ్గర సింహమే ఐనాడు(సముద్ర లంఘనమపుడు).
మంగాంబుధిని శ్రీవెంకటేశునికి బలవంతుడైన బంటైనాడు(అలమేలు మంగాపురం ఒకప్పుడు పెద్ద చెఱువులా వుండి అంబుధి అని పిలనబడేదా?). అటువంటి హనుమంతునికి ఈ లోకంలో యెదురు నిలవగల వారెవ్వరు?

ఈ సంకీర్తన అన్నమయ్య హనుమంతునిపై చెప్పిన వాటిలో ఒకటి.నిన్న రాత్రి భక్తి టివిలో బాలక్రిష్ణప్రసాద్ గారు వాళ్ళబ్బాయితో కలిసి పాడి నేర్పించారు.అందులో ఒకటి రెండు మార్పులు చేసారు వారు.యెవరైనా నా సందేహాలు తీర్చగలరేమోనని.అన్నమయ్య కీర్తన టిటిడి వారి ప్రచురణలో పాడి రాగం లో వుంది.నాకు సంగీతంలో ఓనమాలు కూడా తెలియవు.వారు తోడి రాగంలో చెప్పారు.రెండూ ఒకటేనా లేక వేర్వేరా? "ముందటనేలే పట్టము" దీనిని "ముందట నేలెడి పట్టముగా' మార్పు చేసారు."యెందు నీ హనుమంతుని" అన్నదానిని "యెందు నా హనుమంతుని" గా మార్చారు.మూడవ చరణం రెండో పాదం- "చెలఁగి" అని ప్రారంభమైతే "మెలఁసి" అని మార్చారు.దీనివల్ల యతి సరిపోతుందో లేదో తెలియదు.

No comments:

Post a Comment