Sunday, October 6, 2019

అంతర్యామీ అలసితి సొలసితి

అంతర్యామీ అలసితి సొలసితి
ఇంతట నీ శర ణిదే చొచ్చితిని. IIపల్లవిII

కోరినకోర్కులు కోయనికట్లు
తీరవు నీవవి తెంచకా
భారపుఁబగ్గాలు పాపపుణ్యములు
నేరుపులఁ బోవు నీవు వద్దనకా. IIఅంతII

జనుల సంగములఁ జక్కరోగములు
విను విడువవు నీవు విడిపించకా
వినయపుదైన్యము విడువనికర్మము
చనదది నీవిటు సంతపరచకా. IIఅంతII

మదిలో చింతలు మయిలలు మణుఁగులు
వదలవు నీవవి వద్దనకా
యెదుటనె శ్రీవేంకటేశ్వర నీ వదె
అదనఁ గాచితివి అట్టిట్టనకా. IIఅంతII ౨-౪౭౫

నాలో వుండే ఓ పరమాత్మా! అలసిపోయాను, మూర్ఛపోతున్నాను.ఇంతలో నిన్నిదే శరణు కోరుచున్నాను.
నేను కోరిన కోరికలు నా శరీరాన్ని బంధించే కోయకవున్న తాళ్ళు. నీవు వాటిని తెంచకుండా అవి తెగవు.
నే జేసిన పాపపుణ్యాలు భారమైన పగ్గాల వంటివి.అవి నీవు వద్దనకపోతే నా సామర్ఢ్యముతో తెగిపోవు.
జనుల సంసర్గముల వలని కలిగే రోగములు, వినవయ్యా! నీవు విడిపించక అవి విడిచిపోవయ్యా.
వినయంతో కూడిన దైన్యమూ,విడిచి పెట్టకుండా తనతోనే ఉండే కర్మమూ నీవిటు వొద్దికచేయక(లేక శాంతపరచక) నన్ను విడిచి వెళ్ళవయ్యా.
నా మదిలోని చింతలూ,నా దగ్గరి మైలలూ,మణుగులకొలదీ వున్నవి నీవు వద్దనక అవి నన్ను వదలవు.
అటూ ఇటూ అనకుండా ఓ శ్రీవేంకటేశ్వర నీవు నా యెదురుగా వుండి నన్ను అదనులో కాచి రక్షించావయ్యా.

No comments:

Post a Comment