Monday, October 7, 2019

తమ సత్వ మెఱిఁగియు దాఁచిరి గాకా

తమ సత్వ మెఱిఁగియు దాఁచిరి గాకా
తము నేలే రాము స్వతంత్రము చూపవలసి IIపల్లవిII

హనుమంతుని తోఁక నసురులందరుఁ గూడి
మును లంకలో నగ్ని ముట్టించే వేళను
అనలము శీతో భవ యన నేరిచిన సీత
పనివి రావణ హతో భవ యన నేరదా IIతమII

అంకెల జలధి దాఁటి యట రాముని ముద్రిక
సంకె లేక చేతఁ బట్టి సాహసమునా
లంకాధిదేవతయైన లంకిణిఁ గొట్టినవాఁడు
వుంకించి రావణుఁ జంప నోపఁడా వాయుజుఁడు IIతమII

శ్రీవేంకటేశుఁడైన శ్రీరాఘవుని పంపున
వావిరి నంగదముఖ్య వానరులెల్లా
ఆవేళ హేమపాత్ర లగ్నిలో వేసినవారు
రావణునందులో వేసి రా నోపరా IIతమII 15-263




తరువాత ఈ బంగారు పాత్రలు అగ్నిలో వేసిన కధ రామాయణం లో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో
నాకు తెలియదు.ఎవరైనా చెప్పి పుణ్యం కట్టుకోరూ---

దీనిలో సీత,హనుమంతుడు,అంగదుడు మొదలైనవారంతా రాముని గొప్పతనం లోకానికి తెలియాలని
ఉద్దేశించి మాత్రమే వారా పనులను చేయకుండా వదిలిపెట్టారట! కాని వాళ్ళంతా ఆ పనులు చేయగల సమర్ధత
గలనారేనట!తాళ్ళపాక కవుల సంకీర్తనలు ఒక్కోటీ ఒక్కో అణిముత్యమే.అవి చదవటానికి,వ్రాయటానికి,పాడుకోవటానికి అత్యంత
ఆనందదాయకాలు.

No comments:

Post a Comment