Sunday, October 6, 2019

విచ్చనవిడినీ యాడీ వీఁడె కృష్ణుఁడు

విచ్చనవిడినీ యాడీ వీఁడె కృష్ణుఁడు
వొచ్చెములేనివాఁడు వుద్దగిరికృష్ణుఁడు IIపల్లవిII


గల్లుగల్లుమనఁగాను గజ్జలు నందెలతోడ

బిల్లఁగోట్లా
డీని పిన్నకృష్ణుఁడు
కెల్లురేఁగి వీధులనుఁ గేరి 
పుట్టచెండులాడీ
బల్లిదుఁడు గదవమ్మ బాలకృష్ణుఁడు. IIవిచ్చII


తమితోడ గోపాలులు తానుఁ గూడి ముంగిటను
సముద్రబిల్ల
లాడీ సాధుకృష్ణుడు
చెమటలుగార 
సిరిసింగనవత్తి యాడీ
గుమితాన వీఁడే యమ్మా గోపాలకృష్ణుఁడు. IIవిచ్చII


వుదుటునఁ బారి పారి వుడ్డగచ్చకాయలాడీ
ముదముదొలఁకఁగాను ముద్దుకృష్ణుఁడు

అదివో శ్రీవేంకటేశుఁ 
డాటలెల్లాఁ దానే యాడీ
పదివేలు చందాల శ్రీపతియైన కృష్ణుఁడు. IIవిచ్చII
౪-౧౭౨

ఈ మధ్య బ్లాగులలో ఒకరిద్దరు పెద్దలు వారి వారి చిన్ననాటి ఆటలను గుర్తుచేసుకొని వారి పిల్లలు ఈ రోజుల్లో కంప్యూటర్ల మీదనే ఎక్కువకాలం గడపాల్సిరావటం గురించి తలచుకొని- ఆ యా ఆటపాటలను బ్లాగులలో వ్రాద్దామనుకోవటం చూసి ఈ కీర్తనను పోస్టు చేసాను. అన్నమయ్య గారి కాలంలో నున్న కొన్ని ఆటలు ఇందులో ఉన్నాయి. బిల్లంగోరు, పుట్టచెండ్లు, సముద్రబిల్లలు, సిరిసింగనావత్తి, వుడ్డగచ్చకాయ -ఈ ఆటలలో బిల్లంగోరు ఆట తప్ప మిగిలిన అటల గురించి నాకూ ఏమీ తెలియదు. హంసవింశతిలో ఇంకా కొన్ని ఆటలను పేర్కోవటం జరిగింది. ఈ ఆటలను ఏ విధంగా ఆడతారో తెలుసుకోవాలని ఉంది. తెలిసిన వారెవరైనా చెప్తారేమోననే చిన్న ఆశ. తీరుతుందనే అనిపిస్తున్నది.

No comments:

Post a Comment