Sunday, October 6, 2019

వినరయ్య నరసింహవిజయము జనులాల

వినరయ్య నరసింహవిజయము జనులాల
అనిశము సంపదలు నాయువు నొసఁగును . IIపల్లవిII

మొదలఁ గొలువుకూటమున నుండి కశిపుఁడు
చదివించెఁ బ్రహ్లాదుని శాస్త్రములు
అదన నాతఁడు నారాయణుఁడే దైవమనె
అదిరిపడి దైత్యుఁడు ఆతనిఁ జూపుమనె .    IIవినరII

అంతటఁ బ్రహ్లాదుఁడు ' అన్నిటానున్నాఁ ' డనియె
పంతమున దానవుఁడు బాలునిఁ జూచి
యెంతయుఁ గడఁకతోడ ' ఇందులోఁ జూపు ' మని
చెంతనున్న కంబము చేతఁగొని వేసె .     IIవినరII

అటమీఁదట బ్రహ్మాండం బదరుచు
కుటిలభయంకరఘోషముతో
చిట చిట చిటమని పెట పెట పెటమని
పటపట మనుచును బగిలెఁ గంబము .    IIవినరII

కులగిరు లదరెను కుంభిని వడఁకెను
తలఁకిరి దైత్యులు తల్లడిలి
కలఁగెను జగములు కంపించె జగములు
ప్రళయకాలగతిఁ బాటిల్లె నపుడు .    IIవినరII

ఘననారసింహుఁ డదె కంబమునందు వెడలె
కనుపట్టె నదిగొ చక్రజ్వాలలు
మునుకొని వెడలెఁ గార్ముకముక్తశరములు
కనకకశిపునకుఁ గలఁగె గుండియలు .   IIవినరII

అడరె నద్దేవునికోపాగ్నులు బెడిదపు -
మిడుఁగురులతోడుత మిన్నులుముట్టి
పిడుగులురాలేటిభీకరనఖరములు
గడుసు రక్కసునికి గాలములై తగిలె .    IIవినరII

తొడికి పట్టి విష్ణుఁడు తొడమీఁద నిడుకొని
కడుపు చించెను వానిగర్వమడఁగ
వెడలెఁ జిల్లున వానివేఁడి నెత్తురు నింగికి
పొడి వొడియాయ శత్రుభూషణములెల్లను .   IIవినరII

నెళ నెళన విరిచె నిక్క వానియెముకలు
పెళపెళ నారిచి పెచ్చు వెరిగె హరి
జళిపించి పేగులు జంద్యాలుగా వేసుకొనె
తళుకుఁగోరలు తళతళమని మెరిచె .     IIవినరII

పెటలించి నరములు పెరికి కుప్పలువేసి
గుటగుటమని రొప్పె గోవిందుఁడు
చిటిలించి కండలు చెక్కలు వారఁజెండి
కుటిలదానవుఁ జూచి ' ఖో ' యని యార్చెను .   IIవినరII

తెంచి శిరోజములు దిక్కులకు వాని -
పంచప్రాణములుగొనెఁ బరమాత్ముఁడు
అంచెల నీరీతిని ప్రహ్లాదునిపగ నీఁగె
మించి దేవతలు మితిమీఱి జయవెట్టిరి .    IIవినరII

అప్పు డిందిరాదేవి యంకమునఁ గూచుండె
వొప్పుగ శాంతమందె నహోబలేశుఁడు
తప్పక కోనేటిదండఁ దానై యిందును నందు
చిప్పిల వరములిచ్చీ శ్రీవేంకటేశుఁడు . II వినర II

No comments:

Post a Comment