Sunday, October 6, 2019

తలఁచిన దేహము నిలువదు తా ననుఁ దలఁచునొ తలఁచఁడొ

తలఁచిన దేహము నిలువదు తా ననుఁ దలఁచునొ తలఁచఁడొ
వలనుగఁ జెలిమాటలు విని వచ్చీనో రాఁ డో IIపల్లవిII

శిరసున నంటిన పునుఁగిటు చెక్కుల జారెడుననుచును
ఉరవడిఁ దివియుచుఁ గొనగోరూఁదిన చందములు
మురిపెపు మొలనూళ్ళపై(ళులపై?) మొగపుల సొబగులు చూచుచు-
నరుదుగ గరమున నక్కడ నంటెడి యాసలును. IIతలఁచిII

చెనకుల వీడెపురసమిదె సెలవులఁ జెదరెడిననుచును
నునుపగు గోళ్ళ(ళుల?) వాతెర నొక్కినచందములు
పెనగొను ముత్యపుసరముల పెక్కున దీర్చెదననుచును
చనవునఁ జనుఁగవపైఁ జే చాఁచిన చందములు।IIతలఁచిII

వుద్దపు నడపులలోపల నొయ్యన పాదము జారిన-
నొద్దికతో నునుఁగౌఁగిట నొరసిన చందములు
నిద్దపుఁ దిరువేంకటగిరినిలయుఁడు ననుఁ దనకౌఁగిట-
నద్దిన కస్తురిచెమటల నలమిన చందములు।IIతలఁచిII

ఈ కీర్తన నడక చూడగానే సంకీర్తనా లక్షణ గ్రంధము దొరికి దీని లక్షణం ఛందస్సు వగైరా తెలుసుకొంటే బాగుండును గదా అనిపిస్తుంది।అందమైన నడక తూగు వున్నాయి కీర్తనలో।
వారిని తలచుకోగా శరీరము నిలవదు, తాను నను తలచునో తలచడో , నేర్పుగా చెలి చెప్పిన మాటలు విని వస్తాడో రాడో।
శిరస్సున అంటిన పునుగు ఇటు చెక్కుల మీదుగా జారినదనుచును,అతి వేగముగ ఆకర్షించు కొనగోట ఊదిన చందములు, మురిపెపు మొలతాళులపై ఉన్నహారముల ముఖభాగముల సొబగులు చూచుచు, అరుదుగ చేతితో అక్కడ అంటుకొనే ఆసలను --తలచికొనిన
ఎదిరించినపుడు తాంబూలరసము ఇదిగిలా పెదవుల చెదిరినదనుచును, నునుపైన
గోళ్ళతో పెదవిని నొక్కిన చందములు, ఒకదానితో ఒకటి పెనవేసికొన్న ముత్యపుసరముల ఆధిక్యమును తీర్చెదననుచును, చనువుగా చనుగవపై చేయి చాచిన చందములు తలచిన--
తొందరపాటు నడకలలో ఒక్కసారిగా పాదము జారినపుడు వొద్దికగా పడిపోకుండా తన కౌగిటిలో ఒరసి పట్టుకున్నచందములు, స్నేహముతో తిరువేంకటగిరి నిలయుడు నన్ను తన కౌగిటనద్దిన కస్తురి చెమటలతో అద్దిన చందములు -తలచిన దేహము నిలువదు.

No comments:

Post a Comment