Sunday, October 6, 2019

కనకాంబరుని గుణగణముల్ శ్రుతులు గని చిక్కుగొనురీతిఁ గను కపోలములు

అన్నమాచార్య చరిత్రము
రాయఁ డన్నమాచార్యుని మరలఁ బిలిపించుట
కనకాంబరుని గుణగణముల్ శ్రుతులు
గని చిక్కుగొనురీతిఁ గను కపోలములు


నత్తఱి మదిలోని హరికీర్తి మొలక-
లొత్తినగతి నున్న యూర్ధ్వపుండ్రములు


లాలితాచ్యుతభక్తిలలన వరించు-
మాలికగతి తిరుమణివడంబులును

తలనిడు విష్ణుపాదపుఁ దమ్మిపువ్వు
మెలుపైన కెంబట్టు మేలుకుళ్ళాయి


అరవిందనయను కృపామృతధార-
కరణిఁ జూపట్టెడు కంఠమాలికయు


నరహరికై కంకణము గట్టియున్న-
సరణిఁ జూపట్టు పచ్చల కడియములు


ధవళనేత్రుని శారదావిలాసంబు
నివసించునట్లున్న నిలువు పేరణము


వాసుదేవునియాజ్ఞ వడిఁ జుట్టుకొన్న-
యా సత్త్వగుణమున నలరు దుప్పటము


నలవఁడ జతురంతయానంబు నెక్కి
బలసి సంకీర్తనపరుల సేవింప

ఘనతర ధవళ శంఖధ్వానమడరఁ
జనుదెంచి నృపతి యాస్థానంబు చెంతఁ

బల్లకి డిగి వెంటఁ బరఁగు వైష్ణవుని-
నల్లన చెయ్యూఁది యాలోని కరిగి


కూరిమిఁ దనరాక కోరి వీక్షించు-
నారాజుఁ గదిసి నెయ్యముతియ్య మెసఁగ


సొలవక " శ్రీనివాసో రక్ష " తనుచు
నెలమిఁ జే తిరుమణి నిచ్చె నిచ్చుటయు,


నెదురుగాఁ జనుదెంచి యెలమిఁ జేకొనుచు
ముదమునఁ గరపద్మములు సాఁగి మ్రొక్కి


యన్నమాచార్యుతో ననుఁగు దీపింపఁ
దిన్నని పసిఁడిగద్దియమీఁద నుండి

No comments:

Post a Comment