Sunday, October 6, 2019

నీ చిత్తము కొలఁది నే నడచుటింతే కాక

నీ చిత్తము కొలఁది నే నడచుటింతే కాక
యేచి సిగ్గు విడువఁగ నిల్లాలికి సంగతా. IIపల్లవిII

కొంకక నేనే నీకొంగు వట్టి తీసితేను
అంకెల నిదెంతగయ్యా ళనకుండేవా
మంకుల నెన్ని సేసినా మగవాని కమరును
జంకించి యాఁటదానికి చలివాయఁ జెల్లునా. IIనీ చిII

వొద్దనుండి నిన్నుఁ జూచి వూరకే నే నవ్వితేను
అద్దో యిదెంతగబ్బి యనకుండేవా
కొద్ది మీరి యెట్టుండినాఁ గోడెకాఁడనీ కమరు
చద్ది బింకము రాణివాసములకుఁ దగునా. IIనీ చిII

ముంచి నేనే నీకాఁగిలి మోరఁగకడిగితేను
అంచెల నిదెంతదిట్ట యనకుండేవా
కొంచక శ్రీవేంకటేశ కూడితి వింతలో నీవె
మించిన పట్టపుదేవి మేర మీఁర జెల్లునా. IIనీ చిII

No comments:

Post a Comment