Sunday, October 6, 2019

ఎరవు గడు సతమాయె నిదియెకదవె

ఇటువంటి భావాన్నే ఇంకో కీర్తనలో ఇలా వర్ణిస్తా డన్నమయ్య.
సామంతం-జంపె
ఎరవు గడు సతమాయె నిదియెకదవె
అరవీడుటే సొబగు లాయెఁ దురుమునకు IIపల్లవిII

నిక్కముగ ననలమున నీరు జనియించెనను
టిక్కడనె పొడగంటి మిదియుఁగదవె
పొక్కుచును విరహాగ్నిఁ బొరలఁగాఁ జెలిమేనఁ
జక్కఁ బైపైఁ బొడమె జవ్వాది చెమట IIఎరII

కలుగు ననలంబుకడ గాలి యనఁగా నదియు
నెలమి నిచ్చట కలిగె నిదియెకదవె
చెలఁగేటి చెలిమేనఁ జిత్త జాగ్నికిఁదోడు
నిలువ నియ్యక కలిగె నిట్టూర్పుగాలి. IIఎరII

నీడల నెండలను నెయ్యమలరఁగఁ గూడు
టీడనే పొడగంటి మిదియుఁగదవె
వేడు కలరంగఁ దిరువేంటేశ్వరుఁ గూడి
వీడుదేరఁగఁ గలిగె వనిత పరవశము. IIఎరII


ఛెలికత్తెలు అంటున్నారిలా:
ఎరువు తెచ్చుకున్న పోలిక నిజమవ్వడం ఇక్కడే చూస్తున్నాం కదే.కొప్పునకు అరవీడి(సగం ఊడి) ఉండటం సొబగును చేకూర్చింది।
అగ్ని నుండి నీరు పుట్టిందనే మాట నిజమవ్వటం యిక్కడనే చూస్తున్నాం,ఇదే కదవే,
చెలి విరహాగ్నితో పొక్కగా ఆమె శరీరం మీద జవ్వాది వాసనతో చెమట పుట్టింది.
అగ్నికి గాలి తోడవుతుందనే మాట నిజమవ్వటం కూడా ఇక్కడనే కనపడుతోంది కదే.
చెలిమేన చెలగుతున్న మదనాగ్నికి తోడు నిట్టూర్పు గాలి నిలువనియ్యకుండా వీస్తోంది కదే.
ఎండలూ నీడలూ స్నేహంగా కూడి ఓక్కచోటే ప్రక్కప్రక్కనే ఉంటాయనడం ఇక్కడే చూస్తున్నాం కదే.
వేడుకతో శ్రీవేంకటేశ్వరుని కూడి వనిత(అలమేల్మంగ) తేటతేటగా పరవశాన్ని పొందుచున్నది.

No comments:

Post a Comment