Sunday, October 6, 2019

ఇప్పుడిఁక నడుగరే యేమనీని

ఇప్పుడిఁక నడుగరే యేమనీని
రెప్ప లెత్తి చూడకుంటే రేపే మాపాయను IIపల్లవిII

అప్పటినుండియు విభుఁడక్కడనే వుండఁగాను
కప్పురము నోటికి కారమై తోఁచె
చిప్పిలుఁ దనమాటలు చెవులుసోఁకకుండఁగా
దప్పికిఁ గొన్న పన్నీరు తానే వుడుకాయను. IIఇప్పుII

నగుతా నాతోఁ దాను నంటు చూపకుండఁ గాను
పొగరుఁ గస్తురిపూత పోగులాయను
పగటునఁ బాన్పుపైఁ దాఁ బవ్వళించకుండఁ గాను
జిగిఁ గట్టిన చెంగావిచీరే వెట్టాయను. IIఇప్పుII

శ్రీవేంకటేశ్వరుఁడు చేతికి లోనుగాఁగా
వేవేలు భోగములు వేడుకాయను
యీవేళఁ దా నన్నుఁ గూడి ఇన్నిటా మన్నించఁ గాను
కావలసిన పనులు కడు మంచివాయను. IIఇప్పుII

No comments:

Post a Comment