Sunday, October 6, 2019

తలఁచిన దేహము నిలువదు తాననుఁ దలఁచునొ తలఁచఁడొ

తలఁచిన దేహము నిలువదు తాననుఁ దలఁచునొ తలఁచఁడొ
వలనుగఁ జెలిమాటలు విని వచ్చీనో రాఁడో IIపల్లవిII

శిరసున నంటిన పునుఁగిటు చెక్కుల జారెడిననుచును
ఉరవడిఁ దివియుచుఁ గొనగోరూఁదిన చందములు
మురిపెపు మొలనూళులపై మొగపుల సొబగులు చూచుచు-
నరుదుగ గరమున నక్కడ నంటెడి యాసలును IIతలచిII

చెనకుల వీడెపురసమిదె సెలవులఁ జెదరెడి ననుచును
నునుపగు గోళుల వాతెర నొక్కిన చందములు
పెనగొను ముత్యపు సరముల పెక్కువ దీర్చెదననుచును
చనువునఁ జనుఁగవపైఁ జే చాఁచిన చందములు IIతలచిII

వుద్దపు నడపులలోపల నొయ్యన పాదము జారిన-
నొద్దికతో నునుఁగౌఁగిట నొరసిన చందములు
నిద్దపుఁ దిరువేంకటగిరినిలయుఁడు ననుఁ దనకౌఁగిట-
నద్దిన కస్తురిచెమటల నలమిన చందములు। IIతలచిII ౫-౩౬౦

ఎంత సొగసైన సంకీర్తన!
తను ఆయనను తలచుకుంటేనే తన దేహము పరవశిస్తుందట! తాను నన్ను తలుస్తున్నాడో లేడో!నేర్పుగా చెప్పే చెలి మాటలు విని,.. వస్తాడో!..రాడో!
తలమీద అంటిన పునుగు చెక్కిళ్ళమీదుగా జారుతుంటే వాటి వేగాన్నాకర్షిస్తూకొనగోటితో ప్రక్కకు ఊదిన విధములు,
మురిపాల మొలతాళ్ళపై ధరించిన హారాదుల ముఖభాగముల సొగసులు చూస్తూ ఆశ్చర్యంగా చేతితో అక్కడ తాకే అపేక్షలను-- తలచిన దేహము నిలువదు
బుగ్గలలో నిండిన తాంబూలరసము పెదవులనుండి జారునపుడు క్రింది పెదవిని నునుపైన గోళ్ళతో సుతారముగా నొక్కిన చందములు, వక్షస్థలముపై చిక్కుపడిన హారముల చిక్కులను వేరుపరచు నెపముతో చనువుగా చనుదోయిపై చేతిని చాచిన చందములు---తలచిన దేహము నిలువదు
తొందరపాటుతో నడచినపుడు ఒడుపుగా పాదము జారినపుడు, నేర్పుతో తన కౌగిట అదిమిన చందములు, స్నేహముతో తిరువేంకటనిలయుడు నన్ను తన కౌగిట చేర్చగా అద్దిన కస్తురి చెమటలతో అలమిన చందములు--- తలచిన దేహము నిలువదు.

No comments:

Post a Comment