Sunday, October 6, 2019

ఆయలేరే యేమి చెప్పి రాతనిసుద్దులు నాకూ

ఆయలేరే యేమి చెప్పి రాతనిసుద్దులు నాకూ
తాయిమక్కళాలె కాక దయగద్దా తనకు। IIపల్లవిII

కన్నులఁ జూడనె పట్టె కాఁకలు సేయనె పట్టె
ఇన్నిటా తా నన్నుఁ గూడే దెప్పుడో కాని
సన్నలు సేయనే పట్టె చవులు చూపనే పట్టె
వెన్నెల బాయిటికి రా వేళ లేదు తనకు। IIకన్నులII

నవ్వులు నవ్వనే పట్టె నాలిసేయనే పట్టె
ఇవ్వల నన్నుం గూడేది యెన్నఁడే తాను
పువ్వుల వేయనే పట్టె బుజ్జగించనే పట్టె
పవ్వళించం బ్రొద్దులేదు పను లేలే తనకు।IIకన్నులII

మాటలాడనే పట్టె మనసు చూడనే పట్టె
ఈటునం గాలు దొక్కేది యెన్నఁడే తాను
పాటించి శ్రీవెంకటాద్రిపతి నన్ను నురముపై
తేటలుగా నెక్కించుక దించ నెడలేదు। IIకన్నులII ౬-౧౧౫
చాలా అందమైన సంకీర్తన।ఈ కీర్తనను అలమేలు మంగ పరంగా చెప్పిన (అరుదైన) కీర్తనగా అనుకోవచ్చనుకుంటా।(ఇలా ఆవిడ పరంగా చెప్పినట్లున్నకీర్తనలు తక్కువగా ఉన్నాయని యెవరో అన్నారు)
అలమేలుమంగ శ్రీ వేంకటేశ్వరుని, ఆతడు తనను కూడటంలో చేసే తాత్సారాన్ని సహించలేక చెలికత్తెలతో అంటున్నదిలా।
ఆతని సుద్దులు నా కేమేం చెప్పేర్లేవే, తాయిమక్కళాలె(ఈ జాతీయానికి సరియైన అర్ధం ఎవరైనా చెప్పి కొంచెం పుణ్యం కట్టుకోరూ- శబ్ద రత్నాకరంలో ఉన్నది కూడా నాకు సరిగా తెలియలేదు।)కాని తనకు దయ లేదేమి సేతునే।
ఆతనికి కన్నులతో చూట్టానికే (సమయం అంతా) పట్టింది, కోపాలు సేయటానికే పట్టింది। వీటన్నిటి మధ్య తాను నన్ను కూడేదెప్పుడో కాని।సైగలు చేయనే పట్టింది,చవులు(అందాలు?) చూపనే పట్టె వెన్నెల బయటికి రావడానికి తనకు
వేళే కుదరలేదేమి సేతునే।
నవ్వులు నవ్వనే పట్టె, నన్ను వంచనలు సేయనే పట్టె ఈవల నన్నతడు కూడేదెప్పుడే।పువ్వులు వేయడానికి,నన్ను బుజ్జగించడానికే సమయమంతా పడితే నాతో పవళించడానికి పొద్దే చాలదే, ఈ పనులన్నీ తనకేలే.
మాటలాడ్డానికి,మనసు చూడ్డానికే సమయం అంతా పడితే ఇంక ఈటున(?) నా కాలు తను తొక్కేదెన్నడే।
శ్రీవేంకటేశ్వరుడు నన్ను నిర్మలంగా తన వక్షస్థలాన్నెక్కించుకొని అక్కడినుండి దించడాని కెడమే లేదే.

No comments:

Post a Comment