Sunday, October 6, 2019

మొత్తకురే యమ్మలాల ముద్దులాఁడు వీఁడె

మొత్తకురే యమ్మలాల ముద్దులాఁడు వీఁడె
ముత్తెమువలె నున్నాఁ డు ముద్దులాఁ డు। IIపల్లవిII

చక్కనియశోద దన్ను సలిగతో మొత్తరాఁ గా
మొక్కఁ బోయీఁ గాళ్ళకు ముద్దులాఁ డు
వెక్కసాన రేపల్లె వెన్నలెల్లా మాపుదాఁ కా
ముక్కున వయ్యంగఁ దిన్న ముద్దులాఁ డు। IIమొత్తII

రువ్వెడిఁ దల్లిరోలఁ దన్నుఁ గట్టెనంటా
మువ్వలగంటలతోడి ముద్దులాఁ డు
నవ్వెడిఁ జెక్కులనిండా నమ్మికబాలునివలె
మువ్వురలో నెక్కుడైన ముద్దులాఁ డు। IIమొత్తII

వేలసంఖ్యలసతుల వెంటఁ బెట్టుకొని రాఁ గా
మూలఁ జన్ను గుడిచీ నీముద్దులాఁ డు
మేలిమి వేంకటగిరిమీఁద నున్నాఁడిదె వచ్చె
మూలభూతి దానైన ముద్దులాఁ డు। IIమొత్తII ౬-౧౪౪

ఓ అమ్మలాల ! ముద్దొచ్చే ఈ బాలుడ్ని మొత్తకండే। ముత్యంలా ఉన్నడే ఈ ముద్దులాఁడు।
అందమైన యశోద తనను సలిగ(?)తో కొట్టరాగా ఈ ముద్దులాడు కాళ్ళకు మొక్కబోతున్నాడే!
దుస్సహముతో రేపల్లెలో వెన్నలన్నీ మాపుదాకా ముక్కుపగిలిందాకా తిన్నముద్దులాడే!
సరిచేసిన తాళ్ళతో తల్లి తనను రోలికి కట్టెనంటా మువ్వల గంటలతో ఆగం చేస్తున్న ముద్దులాడే!
నవ్వే చెక్కులనిండా నమ్మికబాలునిలా ముగ్గురు మూర్తులలోన ఎక్కుడైన ముద్దులాడే!
వేలసంఖ్యలోవున్న భార్యలందరితో వస్తే ఓ మూల తల్లి చన్నుతాగుతూ ఉన్నాడే ముద్దులాడు!
అన్నింటికి తానే మూలభూతమైన ముద్దులాడు మేలిమి శ్రీవేంకటగిరి మీద వచ్చి వున్నాడిదే.

No comments:

Post a Comment