Sunday, October 6, 2019

నీగుణమే ఆతని నిలువెల్లాను

నీగుణమే ఆతని నిలువెల్లాను
చేగదేరె పనులెల్లా చిత్తగించు మికను IIపల్లవిII

కాటుక కన్నుల తోడి కలికి నీ చూపులు
నాటఁగా నాతని మేను నల్లనాయను
తేటల నీ యధరపు తేనె లిచ్చినయందుకు
యీటులేకాతనిమోవి యెఱ్ఱనాయను. IIనీగుII

చేరి నీవు నవ్వఁ గాను చెమట ముత్తేలు రేఁగి
తేరి యాతని భావము తెల్లనాయను
వూరట నీ మేని పస పొరయఁగా నాతని
గౌరవపుఁ బచ్చడము కడుఁ బసిమాయను. IIనీగుII

కోకొమ్మని నీవు నీ కొప్పుదవన మాతని-
కాకడ ముడువఁ గా నంటి పచ్చాయ
యీకడ వేంకటేశు కీమంజిష్టి నీ పయ్యద
పైకొని కప్పి కూడఁ గాపంచెవన్నె నాయను. IIనీగుII 27-213

చెలికత్తె యలమేలుమంగతో:
ఆతని వంటిమీద నిలువెల్లా నీ గుణాలే , పనులెల్లా చేవదేరినవి ఇక ఇవి చూడవమ్మా.
కాటుక కన్నులతో నీవతనిని చూడగానే నీ చూపులు అతని శరీరం మీద నాటడం వల్ల అతను నీలవర్ణుడయ్యాడు.
నీవిచ్చిన పెదవుల తేనె వ్యర్ధం కాకుండా వుండేందుగ్గాను ఆతని మోవి యెఱ్ఱబడింది.
నీవాతని చేరి నవ్వేటప్పటి చెమట ముత్యాల కారణంగా ఆతని భావము వాటివలె తెల్లబడింది.
నీ శరీర కాంతి నొంది ఆతని వస్త్రము పచ్చనై పీతాంబరుడైనాడు.
నీవు తీసుకొమ్మని యిచ్చిన నీ కొప్పులోని దవనము అక్కడాతనికి అంటి పచ్చగా అయింది.
వేంకటేశుని పై నీ యెఱ్ఱని పయ్యద కప్పి ఆతని కూడుటవల్ల పంచవన్నెలాయను.

No comments:

Post a Comment