Sunday, October 6, 2019

ఓహో యంతటివాఁడే వొద్దనున్నవాఁడే హరి

ఓహో యంతటివాఁడే వొద్దనున్నవాఁడే హరి
సాహసపుగుణములచతురుఁడా యితఁడు. IIపల్లవిII

జలధిలోఁ బవళించి జలనిధి బంధించి
జలనిధికన్యకను సరిఁ బెండ్లాడి
జలనిధిలో నీఁది జలనిధి మథియించి
జలధి వెరించిన (వెరిఁజిన?) చలమరా యితడు. IIఓహోII

ధరణికిఁ బతియై ధరణి గ్రుంగిన నెత్తి
ధరణికూఁతురుఁ దానె తగఁ బెండ్లాడి
ధరణిఁ బాదము మోపి ధరణిభారము దించి
ధరణీధరుఁడైన దైవమా యితఁడు. IIఓహోII

కొండ గొడుగుగ నెత్తి కొండఁ దూఁటువడ నేసి
కొండకిందఁ గుదురై కూచుండి
కొండపై శ్రీ వేంకటాద్రి కోనేటిరాయఁడై
కొండవంటిదేవుడైనకోవిదుఁడా ఇతడు. IIఓహోII ౪-౩౯౩

చాలా సొగసైన సంకీర్తన.
ఓహో ఎంతటివాడే!మనవద్దనే వున్నవాడేనే యీ హరి! ఇతడు సాహసపు గుణములు కలిగిన చతురుడటే!
జలధి(సముద్రము)లో పవళించి(సృష్టి మొదటిలో),జలనిధిని(సముద్రాన్నే)బంధించి(రామావతారంలో),జలనిధికన్యక(లక్ష్మీ దేవి)ని తగ పెండ్లాడి,జలనిధిలో నీది(మత్స్యావతారం),జలనిధి మథియించి(కూర్మావతారం),జలధి వెరించిన(?)చలమరే యితడు.

ధరణికి మగడై(?),ధరణి కుంగగా ఎత్తిపట్టి(?),ధరణికూతుర్ని తానే పెండ్లాడి(రామావతారము),ధరణి పాదము మోపి(వామనావతారం?),ధరణి భారము దించి(పరశురామావతారం?),ధరణీధరుడైన(వరాహావతారం) దైవమా యితడు.
కొండ గొడుగుగా ఎత్తి(కృష్ణావతారం),కొండకు రంధ్రమయ్యేట్లుగా నేసి(?),కొండకింద కుదురుగా కూర్చుండి(కూర్మావతారం),శ్రీ వేంకటాద్రి కొండపై కోనేటిరాయడై కొండవలె అండగానుండే కోవిదుడా యితడు.

No comments:

Post a Comment