Sunday, October 6, 2019

నీ వంటి సతులతో నెయ్యమాతఁడు చూపఁగా

నీ వంటి సతులతో నెయ్యమాతఁడు చూపఁగా
ఆవలి మోమై యుందానవారడింత గలదా IIపల్లవిII

సిగ్గున నుందానవో చింతతోనుందానవో
సిగ్గుకుఁ జింతకు సాక్షి చెక్కిటిచేయే
దగ్గరి నీరమణుఁడు తమకించి పిలువఁగ
అగ్గలమయ్యేవదేమే ఆఱడింత గలదా. IIనీవంటిII

మాయలు సేసేవో మంతనాననుందానవో
మాయకు మంతనానకు మంచమే సాక్షి
చేయివట్టి యాతఁడు నీచింతదీరఁ దియ్యగాను
ఆయాలు దాకఁ దొబ్బేవు ఆఱడింత గలదా IIనీవంటిII

కరుణ నీకుఁ బుట్టెనో కాఁకలు నీకు ముంచెనో
కరుణకుఁ గాఁకలకు కాఁగిలే సాక్షి
అరుదై శ్రీవేంకటేశుఁడట్టె నిన్నుఁ గలసెను
అగమగచేవు మేను ఆఱడింత గలదా. IIనీవంటిII


అన్నమయ్య కీర్తనలలో సొగసులు అంతకంతకూ ఇనుమడిస్తాయే కాని ఒకంతట తనివి తీరడవంటూ ఉండదు.

నీలాంటి ఇతర సతులతో ఆతడు స్నేహాన్ని చూపిస్తే ఆవలి దిక్కునకు మొఖము తిప్పుకున్నావేమే!ఇంత ఆరడెక్కడైనా వుందా?(ఉండదా మరి)
సిగ్గుతో నున్నావో చింతతో ఉన్నావో మాకు తెలియటం లేదు.సిగ్గుకూ చింతకూ కూడా చెక్కిటి మీదున్న నీ చెయ్యే సాక్షి.
నీ దగ్గరికి చేరి నీరమణుడు తమకంతో పిలువంగా ఇంత అగ్గలమయ్యేవదేమే!ఇంత ఆరడా?
మాయలు చేసేవో మంతనాన నుందానవో తెలియదు.మరి మాయకూ మంతనానికీ కూడా మంచమే సాక్షి.నీ చేయి పట్టుకొని ఆతడు నీ చింత తీరుద్దామని అనుకుంటూంటే మర్మాలు తాకేలా దొబ్బుతున్నావేటే!ఇంత ఆరడా?
నీకు కరుణే పుట్టిందో కాఁకలే(తాపాలే) నిన్ను ముంచాయో తెలియదు.కరుణకూ, కాఁకలకూ కూడా కాఁగిలే కదా సాక్షి.
అరుదై శ్రీ వేంకటేశుడిట్టె నిన్ను కలసేడు.శరీరాన్నే అరమరచి పోయావే!ఇంత ఆరడెక్కడన్నా వుందా?
ఎంత అందమయినదీ కీర్తన.ఇటువంటి అందచందాలు ఎన్నో ఎన్నెన్నో....

No comments:

Post a Comment