Sunday, October 6, 2019

ఒరయుచు నురమున నునిచితివీకె నీవు

ఒరయుచు నురమున నునిచితివీకె నీవు
అరయఁ గాంతారత్న మన్నిటాఁ గనక IIపల్లవిII

మాటలాడి చూచితేనే మంచి వైదూర్యూలు రాలీ
గాటపుఁ జూపుల మాణికాలు రాలీని
మూటగాఁగ నవ్వితే ముత్యాలు రాలీని
కూటువ నీసతి రత్నకోమలి గనక. IIఒరయుII

బడినడుగడుగుకుఁ బద్మరాగములు రాలీ
జడిసి పొలసినఁ బచ్చలు రాలీని
పడతి చేవిసరినఁ బగడాలు రాలీని
నడుమ నీసతి యంగనామణి గనక. IIఒరయుII

కుంకుమచెమటల గోమేధికాలు రాలీని
సంకుగోరికొన వజ్రాలు రాలీని
పొంకపుఁ బుష్యరాగాలు పొంగీ నీకూటమిని
ఇంక శ్రీవేంకటేశ నీయింతి రత్నాంగి గాన. IIఒరయుII ౭-౩౧౪

పరీక్షించి ఆపెను నీవు నీ వక్షస్థలమునందే ఉంచుకొన్నావు, ఎందుకంటే ఆబిడ అన్నిటా కాంతారత్నం కనక.
ఆమె మాట్లాడి చూస్తేనే మంచి వైఢూర్యాలు రాలేవి.ఆమె కంటిచూపుకే మాణిక్యాలు రాలేవి.ముద్దులు మూటకడుతూ ఆమె నవ్వితే మత్యాలే రాలేవి.ఎంచేతనంటే నీ సతి రత్నకోమలి కనక.
ఆమె నడబడితే అడుగడుక్కూ పద్మరాగాలే రాల్తాయి.ఆమె జడుపుతో సమీపిస్తే పచ్చలే రాల్తాయి.ఆవిడ చేయి విసరితేనే పగడాలు రాల్తాయి.ఎందుకంటే నీ సతి అంగనామణి కనక.
ఆవిడ ధరించిన కుంకుమచెమటలకు గోమేధికాలే రాల్తాయి.శంఖమువంటి ఆమె గోరికొన నుండి వజ్రాలే రాల్తాయి.నీతో పొందులో పుష్యరాగాలే పొంగుతున్నాయి.ఎంచేతంటే నీ యింతి రత్నాంగి కనక.

No comments:

Post a Comment