Sunday, October 6, 2019

అవధరించఁగదయ్య అన్ని రసములు నీవు

అవధరించఁగదయ్య అన్ని రసములు నీవు
తివురుచు నబ్బెనిదె తేనెమోవి రసము IIపల్లవిII

చెలియ చక్కఁదనాన శృంగార రసము
వెలయ బొమ జంకెనల వీర రసము
కలయు రతి కాంక్షలను కరుణా రసము
అలరు మై పులకలను అద్భుత రసంబు. IIఅవII

తరుణి సరసములను తగు హాస్యరసము
పరుషంపు విరహాన భయ రసంబు
బెరయు నిబ్బరములను బీభత్స రసము
గరిమ మరుయుద్ధాన ఘన రౌద్ర రసము. IIఅవII

వనిత ఆనందముల వడి శాంత రసము
ననుపుమంతనములను నవ రసములు
యెనలేని వేంకటేశ నీతోఁ గూడి
దినదిన వినోదాల తిరమాయ రసము. IIఅవII

No comments:

Post a Comment