Sunday, October 6, 2019

ఇందులోపలఁ దనకు నెందువారమె నేము

ఇందులోపలఁ దనకు నెందువారమె నేము
అందంబుగానతని నడుగరె చెలులు. IIపల్లవిII

తగులు గలిగినయడల తమకమింతయు నమరు
నగినయడలను మిగుల నటనలమరు
తెగువ గలిగినయడల తేఁకువలు గడునమరు
మొగమోట గలయెడల మోహంబులమరు. IIఇందుII

మనసులెనసినయెడల మాటలన్నియు నమరు
ననుపు గలిగినయడల నయములమరు
చనవు గలిగినయడల సరసమంతయు నమరు
పెనకువలు గలయడల ప్రియములును నమరు. IIఇందుII

కూడియుండెటియడల గుఱుతులిన్నియు నమరు
వాడికలు గలయడల వలపులమరు
యీడనే శ్రీవేంకటేశుఁడిటు ననుఁ గూడె
వేడుకలు యీయెడల వేవేలు నమరు. IIఇందుII ౭-౩౪


ఈ క్రింది చెప్పిన వారిలో,మేము-తనకు ఏరకానికి చెందినవారమో అందముగా అడగండే -అంటోంది అలమేలు
అభిలాష కలిగినచో ఇంత తమకమూ అమరుతుంది.నవ్వులు నవ్వినపుడు మిక్కిలియైన నటనలు అమరుతాయి.
తెగువ కలిగినపుడు ధైర్యములు వాటంతటవే అమరిపోతాయి.మొగమాటంతో నున్నపుడు మోహమెంతో అమరుతుంది.
--వీని లోపల మేము ఏ రకానికి చెందుతామో చెప్పమంటుంది.
మనసులు కలిసినవేళ మాటలన్నీ అమరుతాయట.అనురాగమున్నచోట స్నేహాలమరిపోతాయి.చనవున్నచోట సరసాలన్నీ అమరుతాయి.
కలయికలు గలచోట ప్రియములూ అమరుతాయి.--వీని లోపల మేము ఏ రకానికి చెందుతామో చెప్పమంటుంది.
కూడిఉన్నచోటులలో ఇన్ని గురుతులూ అమరుతాయట.వాడికలున్నచోట వలపులూ అమరుతాయి.ఇక్కడే శ్రీవేంకటేశ్వరుడు నన్ను కూడి ఉన్నాడు. యీవేళప్పుడు వేడుకలు వేనవేలుగా అమరుతాయి.--వీని లోపల మేము ఏ రకానికి చెందుతామో చెప్పమంటుంది.
అమరు--అనే మాట ఎన్నెన్ని రకాలుగా ఎంతందంగా ఈ కీర్తనలో అమరిందో చూడండి.

No comments:

Post a Comment