Sunday, October 6, 2019

భావమెరఁగనివారు పచ్చెందురుగాని గోరు

భావమెరఁగనివారు పచ్చెందురుగాని గోరు
తావులెరిఁగితే సురతపుసొమ్ముగోరు. IIపల్లవిII

అలిగినవేళలనంటకుండాఁ జిమ్ము గోరు
వలపు నిలుపరాక వడిఁజాఁచేదొక గోరు
చలపట్టి వేరొకతె జగడము దీసే గోరు
బలిమి పంతాన కుపకరించేది గోరు. IIభావII

శిరసు వంపులలోని సిగ్గులు వాపేది గోరు
సరిఁ బరవశములెచ్చరించు గోరు
వొరసితే గురిసేసు నుబ్బుఁగవణపు గోరు
సరసమాడేవేళ చవిరేఁచు గోరు. IIభావII

సమ్మతించకుంటేఁ దాఁకి జంటకు లోఁజేసు గోరు
పమ్మి మనసుకుఁ జలివాపు గోరు
దిమ్ముల వయోమదము తెలియని సాక్షి గోరు
కొమ్మ శ్రీవేంకటేశుతోఁ గూడే యిక్కువ గోరు. IIభావII ౭-౧౫౭


గోరు యొక్క వివిధ ఉపయోగములను అందంగా చెప్పే సంకీర్తన యిది.
అర్ధం తెలియని వారు గోరును పచ్చంటారు(?) గాని ఉపయోగించే తెరవులు తెలిస్తే గోరు సురతానికి చక్కని సొమ్ము అని తెలుసుకుంటారు.
గోరు--ప్రియునిపై అలిగినవేళలో తననతడు అంటకుండా చిమ్మేది,వలపును నిలుపుకోలేని వేళలలో తొందరగా చాచేదీ,మాత్సర్యముతో నున్న వేరొకతె జగడము తీర్చేదీ,బలిమిని పంతమున కుపకరించేదీ,--గోరే.
అలాగే గోరు--శిరసు వంపులలోని సిగ్గులను పోగొట్టేదీ,పరవశమొంది నపుడు సరియైన సమయంలో హెచ్చరించేదీ,వొరసితే గురి సేసు నుబ్బుఁగవణము గోరు(దీనికి అర్ధము తెలియలేదు),సరసమాడే వేళల్లో రసాన్ని పెంచేదీ,-గోరు.
సమ్మతించకుండా ఉన్నపుడు తాకుట ద్వారా ఇద్దరూ జంటగా అయ్యేలా చేసేదీ,మనసుకు చలిని పోగొట్టేదీ,మత్తులో వయోమదము తెలియని సాక్షిగా వుండేదీ, పడతి శ్రీవేంకటేశుతో కూడే యిక్కువను కలిగించేదీ -గోరు. గోళ్ళ కింత కథ ఉందన్నమాట.

No comments:

Post a Comment