Sunday, October 6, 2019

కులుకక నడవరో కొమ్మలాలా

కులుకక నడవరో కొమ్మలాలా
జలజలన రాలీని జాజులు మా యమ్మకు। ॥పల్లవి॥

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాఁకు కాంతలాలా
పయ్యెద చెఱఁగు జారీ భారపు గుబ్బలమీఁద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు। ॥కులు॥

చల్లెడి గందవొడి మైజారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దుఁ బణఁతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచుఁ గంకణాలు గదలీ మా యమ్మకు। ॥కులు॥

జమళి ముత్యాలతోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతులెత్తరో
అమరించె కౌఁగిట నలమేలుమంగనిదె
సమకూడె వేంకటేశ్వరుఁడు మా యమ్మకు। ॥ కులు॥ ౫-౭౩

అన్నమయ్య- అలమేలు మంగ చెలులు మోస్తున్న పల్లకిలో శ్రీవారిని చేరే సన్నివేశాన్ని వర్ణిస్తున్నాడు।
పల్లకీ వెంట ఇరుపక్కలా నడచి వస్తున్న చెలికత్తెలు పల్లకీని మోస్తూన్న చెలులతో అలమేలు సౌకుమార్యాన్ని గురించి ఈ విధంగా అంటున్నారు।
ఓ కొమ్మల్లారా! మరీ అంత కులుకుతూ నడవకండే, మా అలమేల్మంగమ్మకు కురులలో పెట్టుకొన్న జాజులు జలజలా రాలిపోతున్నాయే! కొంచెంగానే శరీరాల్నికదలిస్తూ ఒప్పుగా నడవండే।మన గయ్యాళి శ్రీపాదాల్ని తాకుతున్నదే అమ్మల్లారా। ఆవిడకు భారమైన చనుగవ మీది పైటకొంగు క్రిందికి జారుతోందే! అంతేకాదు,అయ్యో !మా అమ్మ నెన్నుదురు కూడా చెమరిస్తోందే!
కొంచెం నిలవండే!ఆమె పైన చల్లిన మంచిగంధపు పొడి శరీరాన్నుండి జారిపోతుందే! ఓ పల్లకీ పట్టిన ముద్దు పణతుల్లారా కొంచెం ఆగండే! అధికమైన కుందనపు ముత్యాల కుచ్చులు అదురుతుండగా,మా యమ్మ చేతి కంకణాలు గల్లుమంటూ కదలుతున్నాయే!
మా యమ్మకు ముత్యాలు పొదిగిన పావుకోళ్ళని ఇవ్వండే।ఈ రమణికి మణిదీపాల హారతులెత్తండే!
శ్రీ వేంకటేశ్వరు డిదే అలమేల్మంగని కౌగిట చేరుస్తున్నాడే.

No comments:

Post a Comment