Sunday, October 6, 2019

అదిగాక సౌభాగ్యమదిగాక వలపు

అదిగాక సౌభాగ్యమదిగాక వలపు
అదిగాక సుఖమింక నందరికిఁ గలదా। ॥ పల్లవి॥

ప్రాణవల్లభునిఁ బెడఁ బాసి మరుబాణముల
ప్రాణబాధల నెగులుపడుటేఁటి వలపే
ప్రాణేశ్వరుఁడు దన్నుఁ బాయఁజూచిన యపుడు
ప్రాణంబు మేనిలోఁ బాయంగవలదా। ॥అది॥

ఒద్దికై ప్రియునితోనొడఁగూడి యుండినపు-
డిద్దరై విహరించుటిది యేఁటివలపే
పొద్దువోకలకుఁ దమపొలయలుకకూటముల
బుద్ధిలోఁ బరవశము పొందంగవలదా। ॥అది॥

చిత్తంబులోపలను శ్రీవేంకటేశ్వరుని
హత్తించి వాఁడు దానయివుండవలదా
కొత్తయిన యిటువంటి కొదలేని సంగతుల
తత్తరము మున్నాడి తగులంగవలదా। ॥ అది॥ ౫-౨౩౦

అన్నమయ్య సౌభాగ్యమంటే ఏమిటో,వలపు అంటే ఏమిటో,సుఖమంటే ఏమిటో ఈ కీర్తనలో వర్ణిస్తున్నాడు।
ఈ సౌభాగ్యము,వలపు,సుఖము ఇంక అందరికి కలవా అని అంటున్నాడీ కీర్తన పల్లవిలో।అవి ఏమిటంటే--
ప్రాణవల్లభుని ఎడబాసి మరుని బాణములకెరయై ప్రాణంపోయేటటువంటి బాధలతో తఱుమబడేటి వలపు - అది
ఎటువంటి వలపే।ప్రాణవల్లభుడు తనను విడిచిపెట్టచూచినపుడే తన ప్రాణం శరీరాన్నుండి వేరైపోవాలిగదా।(అదీ నిజమైన వలపు అన్నమయ్య దృష్టిలో)
ప్రియునితో కలసి ఒద్దికగా ఒక్కచో చేరి వున్నపుడు ఇద్దరై విహరించుట-ఇది యేటి వలపే-పొద్దుపోవడానికి తమ ప్రణయకోపముల తరువాతి కూటములబుద్దిలో ఒక్కరై పరవశించి పోవాలిగదే।(అదీ నిజమైన వలపు)।
చిత్తములోపల శ్రీవేంకటేశ్వరుని హత్తించుకొని వాడే తానయి ఉండాలిగదే।యిటువంటి కొత్తగావుండే కొఱత లేని సంగతుల సంభ్రమము ముందే ఆడిపెట్టుకొని తగులుకోవాలిగదే।(అదే కదా నిజమైన వలపు)

No comments:

Post a Comment