Sunday, October 6, 2019

వెలది యిట్టుండితేను విభుని చిత్తము వచ్చు

వెలది యిట్టుండితేను విభుని చిత్తము వచ్చు
బలవంతకోలైతే పలుకనేమున్నది IIపల్లవిII

పతి పరాకై వుండితే పైపై నెచ్చరించవలె
మితితో సన్నయెఱిఁ గి మెలఁ గవలె
యితవైన మాటలాడి యింపుల మెప్పించవలె
తతితోఁ గొలువు సేసి దండనుండవలెను . IIవెలII

మొగమెత్తి చూచితే మోహము చల్లఁ గవలెను
నగితే గమ్మటి మారు నగవలె
బిగువుఁ జన్నులంటితేఁ బ్రియపడి వుండవలె
జిగిఁ జెనకితే గుట్టు చేసుకోవలెను. IIవెలII

వేడుకతో మన్నించితే వినయము చూపవలె
జోడై యేకతాన రతిఁ జొక్కించవలె
యీడనె శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
కూడితి మిందరి కివే గుణాలు కావలెను। IIవెలII 24-533

భార్య ఎలా వుంటే భర్త మనసు లోగొనవచ్చో అన్నమయ్య ఈ కీర్తనలో వర్ణిస్తున్నాడు।
భార్య యిలావుంటే భర్త మనసు సంతోషపడుతుంది, అదే బలవంతంగా తెచ్చుకొన్నట్లయితే ఇంక చెప్పేందుకేమున్నది।
పతి పరాకుగా ఉంటే పైపైన హెచ్చరించాలి।గడువుతో ఆతని సన్న యెఱిగి మెలగాలి।
ఆతనికి హితవు కలిగించే మాటలాడి ఆనందాలతో మెప్పించాలి।సమూహంతో కొలువున్నప్పుడు ప్రక్కనే వుండాలి।
ఆతడు మొఖమెత్తి తనవంక చూస్తే మోహాన్ని చల్లాలి।ఆతడు నవ్వితే తాను తియ్యగా తిరిగి నవ్వాలి।
తన బిగువైన చన్నులను స్పర్శించితే సంతోషపడి ఆనందంతో వుండాలి।చల్లని వెలుగులో తనను తాకితే గుట్టు చేసుకోవాలి।
వేడుకతో అతడు తనని మన్నించితే వినయాన్ని చూపాలి।యిద్దరూ ఆలోచనతో ఉన్నపుడు అనురాగముతో పరవశింపచేయాలి।
ఇక్కడ అతడు శ్రీవేంకటేశ్వరుడు నే నలమేల్మంగను కూడితిమిద్దరమూ।ఇందరికీ ఇవే గుణములు కావాలి.

No comments:

Post a Comment