Showing posts with label cha. Show all posts
Showing posts with label cha. Show all posts

Sunday, October 6, 2019

చాటెద నిదియే సత్యము సుండో

చాటెద నిదియే సత్యము సుండో
చేటు లేదీతని సేనించినను IIపల్లవిII

హరినొల్లనివా రసురలు సుండో
సుర లీతనిదాసులు సుండో
పరమాత్ముఁ డితఁడె ప్రాణము సుండో
మరుగక మఱచిన మఱి లేదిఁకను. IIచాటెదII

వేదరక్షకుఁడు విష్ణుఁడు సుండో
సోదించె శుకుఁ డచ్చుగ సుండో
ఆదిబ్రహ్మగన్నాతఁడు సుండో
యేదెస వెదకిన నితఁడే ఘనుఁడు. IIచాటెదII

యిహపర మొసఁగను యీతఁడె సుండో
వహి నుతించెఁ బార్వతి సుండో
రహస్య మిదివో రహి శ్రీవేంకట-
మహిధరంబున మనికై నిలిచె. IIచాటెదII


అన్నమయ్య ఏదైనా విషయాన్ని నొక్కి చెప్పదలిస్తే దాన్ని చాటింపు వేసి మరీ చెప్తాడు.ఈ విషయం చాలా సంకీర్తనల విషయంలో మనకు కనిపిస్తుంది.
ఇదే సత్యము అని చాటింపువేసి మరీ చెప్తున్నాను వినండోహో---శ్రీహరిని సేవిస్తే నష్టం ఎంతమాత్రమూ లేదు గాక లేదు.
శ్రీహరిని అంగీకరించని వాళ్ళందరూ రాక్షసులే,దేవతలందరూ ఈతని దాసులే సుండో.పరమాత్ముడైన ఈతడే ప్రాణము సుండో.
ఇది సంతాపించి మరిస్తే మరిక ఏమీ లేదు.
విష్ణుడే వేదరక్షకుడు,దీనిని శుకమహర్షి మనకు శోధించి నిరూపించాడు.సృష్టికి ఆదిమూలమైన బ్రహ్మను కన్నవాడీతడే.యే దెసను
వెదకినా యీతడే ఘనుడు.
మనందరికీ ఇహపరాలొసగే దీతడే.ఇతనిని పార్వతీ దేవి ప్రార్ధించింది.(విష్ణు సహస్ర నామాల్లో చివరను శివుడు పార్వతీ దేవికి "శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే- సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే" అంటూ విష్ణుమూర్తిని సంక్షిప్తంగా కీర్తించే విధానాన్ని బోధిస్తాడు).రహస్యమిది, శ్రీవేంకటేశ్వరుని కొండమీద ప్రతిష్టించబడి నిలిచి వున్నది.

చేరి యశోదకు శిశు వితఁడు

చేరి యశోదకు శిశు వితఁడు
ధారుణి బ్రహ్మకుఁ దండ్రియు నితఁడు। IIపల్లవిII

సొలసి చూచినను సూర్యచంద్రులను
లలి వెదచల్లెడు లక్షణుఁడు
నిలిచిననిలువున నిఖిలదేవతల
కలిగించు సురలగనివో యితఁడు। IIచేరిII

మాటలాడినను మరియజాండములు
కోటులు వొడమేటిగుణరాశి
నీటగునూర్పుల నిఖిలవేదములు
చాటువనూరేటి సముద్ర మితడు। IIచేరిII

ముంగిటఁ బొలసినమోహన మాత్మలఁ
బొంగించే ఘనపురుషుఁడు
సంగతి మావంటిశరణాగతులకు
నంగము శ్రీవేంకటాధిపుఁ డితఁడు। IIచేరిII

ఈ శ్రీవేంకటేశుడు యశోదకు శిశువైన శ్రీకృష్ణుడే।ఈ భువిలో బ్రహ్మదేవునికి తండ్రి కూడా యితడే।
వైముఖ్యముతో చూచినను సూర్యచంద్రులిరువురిని ఉత్సాహముతో వెదజల్లే లక్షణము కలిగిన వాడితడు।
నిలుచున్నపళంగా అందరు దేవతలను ప్రత్యక్షపరచగలిగే సురల గనియే యితడు।
మాటలలో కోటానుకోట్ల అజాండములను కలుగునట్లు చేయగలిగిన గుణములప్రోవితడు।
నీటైన ఊరుపుల వంటి అన్ని వేదములు ఊరేటి సముద్రము వంటివాడితడు।
ముంగిట వెలసిన మోహనరూపము ఆత్మలయందు పొంగించే గొప్ప పురుషుడితడు।
మావంటి శరణాగతులైనవారికి శరీరము వంటి వాడీ శ్రీవేంకటేశ్వరుడు।

చిక్కువడ్డ పనికిఁ జేసినదే చేఁత

చిక్కువడ్డ పనికిఁ జేసినదే చేఁత
లెక్కలేని యప్పునకు లేమే కలిమి। IIపల్లవిII

తగవులేమి కెదిరిధనమే తన సొమ్ము
జగడగానికి విరసమే కూడు
తెగుదెంపులేమికి దీనగతే దిక్కు
బిగువుఁ గూటికి వట్టి బీరమే తగవు। IIచిక్కుII

పతిలేనిభూమికి బలవంతుడే రాజు
గతిలేనికూటికిఁ గన్నదే కూడు
సతిలేనివానికి జరిగినదే యాలు
కుతదీరుటకు రచ్చకొట్టమే యిల్లు। IIచిక్కుII

యెదురులేమికిఁ దనకేదైనఁ దలఁ పిది
మదమత్తునకుఁ దన మఱపే మాట
తుది పదమునకుఁ జేదోడైనవిభవము
పదిలపుశ్రీ వేంకటపతియే యెఱుక। IIచిక్కుII

చెప్పరాని మహిమల శ్రీదేవుఁడితడు

చెప్పరాని మహిమల శ్రీదేవుఁడితడు
కప్పి కన్నులపండుగగాఁ జూడరో. IIపల్లవిII

అద్దుచుఁ కప్పురధూళి యట్టె మేన నలఁదఁగా
వొద్దిక దేవునిభావ మూహించితేను
మద్దులు విరిచినట్టి మంచి బాలకృష్ణునికి
మద్దులకాంతి మేన మలసినట్టుండె. IIచెప్పII

అమరఁ దట్టుపుణుఁగు అవధరించఁగాను
తమితోఁ బోలికలెల్లఁ దచ్చి చూడఁగా
యమునానది నాఁగేట నండకుఁ దీసుకొనఁగా
యమునానది నలుపు అంటినయట్టుండె. IIచెప్పII

అంగముల శ్రీవేంకటాధిపున కింతటాను
సింగారించి సొమ్ములెల్లఁ జలరేఁగఁగా
బంగారపుటలమేలుమంగ నురాన నుంచగా
బంగారము మేననెల్లాఁ బరగినట్టుండె. IIచెప్పII 

చాలదా బ్రహ్మ మిది సంకీర్తనం మీకు

చాలదా బ్రహ్మ మిది సంకీర్తనం మీకు
జాలెల్ల నడఁగించు సంకీర్తనం. IIపల్లవిII

సంతోషకరమైన సంకీర్తనం
సంతాప మణగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం
సంతతముఁ దలఁచుఁ డీసంకీర్తనం. IIచాలII

సామజముఁ గాచినది సంకీర్తనం
సామమున కెక్కు డీసంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణుసంకీర్తనం. IIచాలII

జముబారి విడిపించు సంకీర్తనం
సమబుద్ధి వొడమించు సంకీర్తనం
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం
శమదమాదులఁ జేయు సంకీర్తనం. IIచాలII

జలజాసనునినోరిసంకీర్తనం
చలిగొండ సుతదలఁచు సంకీర్తనం
చలువ గడు నాలుకకు సంకీర్తనం
చలపట్టి తలఁడుఁ డీ సంకీర్తనం. IIచాలII

సరవి సంపదలిచ్చు సంకీర్తనం
సరిలేని దిదియపో సంకీర్తనం
సరుస వేంకటవిభుని సంకీర్తనం
సరుగుననుఁ దలచుఁ డీసంకీర్తనం. IIచాలII