Showing posts with label da. Show all posts
Showing posts with label da. Show all posts

Sunday, October 6, 2019

దాఁచుకో నీ పాదాలకుఁ దగ నేఁ జేసిన పూజ లివి

దాఁచుకో నీ పాదాలకుఁ దగ నేఁ జేసిన పూజ లివి
పూఁచి నీ కీరితిరూపపుష్పము లివి యయ్యా। ॥పల్లవి॥

వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ
తక్కినవి భండారాన దాఁచి వుండనీ
వెక్కసమగు నీ నామము వెల సులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విఁక నవి తీరని నా ధనమయ్యా। ॥ దాఁచుక

నా నాలికపై నుండి నానా సంకీర్తనలు
పూని నాచే నిన్నుఁ బొగడించితివి
వేనామాల వెన్నుఁడా వినుతించ నెంతవాఁడ
కానిమ్మని నా కీపుణ్యము గట్టితి వింతేయయ్యా। ॥ దాఁచుకో॥

యీ మాట గర్వము కాదు నీ మహిమే కొనియాడితిఁగాని
చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాఁడఁ గాను
నేమానఁ బాడేవాఁడను నేరములెంచకుమీ
శ్రీమాధవ నే నీదాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా. ॥ దాఁచుకో॥ ౨-౩౩౮

చాలా ప్రసిద్ధమైన అన్నమయ్య కీర్తనలలో ఇది ఒకటి।
ఈ సంకీర్తనలు నీ పాదాలకు తగినవిధంగా నేను చేసిన పూజలివి। ఇవి నేను నీకు సమర్పించే పూచిన నీ కీర్తిరూపములైన పుష్పములయ్యా.
మమ్మల్ని ఒద్దికగా రక్షించడానికి వీటిలో ఒక్క సంకీర్తనే చాలు।తక్కినవి భండారాన దాచి వుండనీ।అధికమైన నీ నామము యొక్క వెల సులభము, ఫలమధికము।నీవు నాకు దిక్కై నన్ను ఏలావు।అవి నా తీరని ధనమయ్యా।
నా నాలికపై నిలచి నీవు పూనుకొని నాతోఎన్నో సంకీర్తనలతో నిన్ను పొగడించికొనినావు। వేయి నామాల వెన్నుడా నిన్నునుతించగా నే నెంతవాడను।నీవే కానిమ్మని నాకు ఈ పుణ్యాన్నికట్టావింతేనయ్యా।
ఈ మాట గర్వముతో చెబుతున్నది కాదు।నీ మహిమనే నేను కొనియాడేను కాని వేఱు కాదు।
చేముంచి(?) నా స్వాతంత్ర్యము చెప్పినవాడ కాను।నియమంతో పాడే వాడిని।నేరములెంచకువయ్యా। ఓ శ్రీ మాధవా! నేను నీ దాసుడనయ్యా!నీవు నా పాలి శ్రీవేంకటేశ్వరుడవు.

దీనరక్షకుఁ డఖిలవినుతుఁడు దేవదేవుఁడు రాముఁడు

దీనరక్షకుఁ డఖిలవినుతుఁడు దేవదేవుఁడు రాముఁడు
జానకీపతిఁ గొలువుఁడీ ఘనసమరవిజయుఁడు రాముఁడు IIపల్లవిII

హరుని తారకబ్రహ్మమంత్రమై యమరిన యర్థము రాముఁడు
సురలఁ గాచి యసురల నడఁచిన సూర్యకులజుడు రాముఁడు
సరయువందును ముక్తి చూరలు జనుల కొసఁగెను రాముఁడు
హరియె యీతఁడు హరివిరించుల కాదిపురుషుడు రాముఁడు। IIదీనII

మునులరుషులకు నభయమొసఁగిన మూలమూరితి రాముఁడు
మనసులోపలఁ బరమయోగులు మరగు తేజము రాముఁడు
పనిచి మీఁదటి బ్రహ్మపట్టము బంటు కొసఁగెను రాముఁడు
మనుజ వేషము తోడ నగజకు మంత్రమాయను
 రాముఁడు। । IIదీనII ౨-౧౭౮

బలిమి మించిన దైవికముతో భక్తసులభుఁడు రాముఁడు
నిలిచి తన సరిలేని వేలుపు నిగమ వంద్యుడు రాముఁడు
మెలుపు శ్రీవేంకటగిరీంద్రము మీఁది దేవుఁడు రాముఁడు।
వెలసె వావిలిపాటి లోపలి వీరవిజయుఁడు రాముఁడు। IIదీనII 

దేవుఁడుగలవారికి దిగులుఁ జింతయు లేదు

దేవుఁడుగలవారికి దిగులుఁ జింతయు లేదు
శ్రీవిభుఁడే అన్నిటా రక్షించుఁగనక IIపల్లవిII

యేలికగల బంటుకు యేవిచారములేదు
వోలి మగఁడుగలాలికి వొప్పమి లేదు
పోళిమిఁ దండ్రిగలపుత్రుని కంగద లేదు
మేలుగాఁ బండినభూమికిఁ గరవు లేదు. IIదేవుఁడుII

బలముగలరాజుకు భయమేమియు లేదు
కలిమిగలవాని కక్కర లేదు
యిల నాచారవంతుని కేపాపమును లేదు
తలఁపుఁ బుణ్యముగల ఆతనికిఁ జేటు లేదు. IIదేవుఁడుII

గురువుగలవానికిఁ గొఱఁత యేమియు లేదు
పరముగలవానికి భ్రాంతులు లేవు
యిరవై శ్రవేంకటేశుఁ డిన్నిటా మాకుఁ గలఁడు
అరయ దాసులము మా కడ్డాఁకే లేదు. IIదేవుఁడుII

దేవ ఈ తగవు దీర్చవయ్యా

దేవ ఈ తగవు దీర్చవయ్యా
వేవేలకు నిది విన్నపమయ్యా. IIపల్లవిII

తనువునఁ బొడమినతతి నింద్రియములు
పొనిగి యెక్కడికిఁ బోవునయా
పెనఁగి తల్లికడ బిడ్డలు భువిలో
యెనగొని యెక్కడి కేఁగుదురయ్యా. IIదేవII

పొదుగుచు మనమునఁ బొడమినయాసలు
అదన నెక్కడికి నరుగునయా
నొదుగుచు జలములనుండుమత్స్యములు
పదపడి యేగతిఁ బాసీనయ్యా. IIదేవII

లలి నొకటొకటికి లంకెలు నివే
అలరుచు నేమని యందునయా
బలుశ్రీవేంకటపతి నాయాత్మనుఁ
గలిగితి వెక్కడి కలుషములయ్యా. IIదేవII

దిక్కు లెల్లా సాధించి దేవదుందుభులు మ్రోయ

దిక్కు లెల్లా సాధించి దేవదుందుభులు మ్రోయ-
నెక్కడ చూచినఁ దానే యేఁగీ సేవించరో. IIపల్లవిII

అదివో శ్రీహరితేరు అదె గరుడధ్వజము
కదలేటి ఘనతురంగము లవిగో
పొదలుఁ బూదండ లవే పూఁచి వాఁగే ఘంటలవే
యెదుటఁ దిరువీధుల నేగీ సేవించరో. IIదిక్కుII

వారె అచ్చరలేమలు వారె మునులు రుషులు
వారక కొలిచే దేవతలు వారే
వీరే యనంతగరుడవిష్వక్సేనాదులు
యీరీతిఁ బ్రతాపాన నేఁగీ సేవించరో. IIదిక్కుII

వీఁడె శ్రీవేంకటేశుఁడు వీఁ డలమేల్మంగపతి
వీఁడె శంఖచక్రాదుల వెలసినాఁడు
పోఁడిమి వరములిచ్చీఁ బొసఁగ దాసులకెల్లా
యేఁడేఁడు దప్పకుండాను యేఁగి సేవించరో. IIదిక్కుII